T20 World Cup 2024: భీకర బౌన్సర్.. హెల్మెట్‍లో ఇరుక్కుపోయిన బాల్: వీడియో
BAN vs NED T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో ఓ అనూహ్య ఘటన జరిగింది. బ్యాటర్ హెల్మెట్‍లో బంతికి ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‍గా మారింది.
BAN vs NED: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‍లో ఓ అరుదైన విషయం జరిగింది. గ్రూప్-డీలో భాగంగా ఇరు జట్ల మధ్య కింగ్‍స్టన్ వేదికగా నేటి (జూన్ 13) మ్యాచ్‍లో బంగ్లాదేశ్ బ్యాటర్ తంజిద్ హసన్ హెల్మెట్ గ్రిల్‍లో బంతికి ఇరుక్కుపోయింది. ఓ భీకర బౌన్సర్‌కు ఇలా జరిగింది. దీంతో అంతా అవాక్కయ్యారు.
ఏం జరిగిందంటే..
బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మూడో ఓవర్లో ఈ ఘటన జరిగింది. నెదర్లాండ్స్ పేసర్ వివియన్ కింగ్మా వేగంగా బౌన్సర్ వేశాడు. ఈ బంతిని పుల్ షాట్ కొట్టేందుకు బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ ప్రయత్నించాడు. అయితే, బంతి బ్యాట్‍కు మిస్ అయింది. నేరుగా తంజిద్ హెల్మెట్‍లోకి దూసుకెళ్లింది. హెల్మెట్ విజర్ గ్రిల్‍లో బంతికి ఇరుక్కుపోయింది.
తంజిద్ హెల్మెట్ తీసి కింద కొట్టినా బంతి రాలేదు. అంతవేగంతో వచ్చి హెల్మెట్‍కు ఆ బంతి తాకింది. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. బంగ్లాదేశ్ మెడికల్ టీమ్ వెంటనే మైదానంలోకి వచ్చి తంజిన్‍ను పరిశీలించింది. అయితే, ఈ భీకర బౌన్సర్‌కు తంజిద్‍కు గాయం కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. తంజిద్ హసన్ హెల్మెట్‍లో బంతి ఇరుక్కుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచకప్ 2024 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లో ఒక్కో మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లతో ఉన్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా ఉంది. గెలిచిన జట్టు ప్రస్తుతానికి రెండో ప్లేస్‍కు వెళుతుంది. గ్రూప్ దశలో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది.
గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా వరుసగా మూడు మ్యాచ్‍లు గెలిచి సూపర్-8 దశకు చేరుకుంది. ఈ గ్రూప్‍లో రెండో స్థానంలో నిలిచి సూపర్-8 చేరేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ పోటీ పడతున్నాయి. ప్రపంచకప్‍లో ఈ గ్రూప్ చాలా రసవత్తరంగా ఉంది. అయితే, శ్రీలంక ఎలిమినేషన్ అంచుల్లో ఉంది.
దుమ్మురేపిన షకీబల్ హసన్
నెదర్లాండ్స్‌తో నేటి మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది బంగ్లాదేశ్. 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. సీనియర్ ప్లేయర్ షకీబల్ హసన్ 46 బంతుల్లోనే 64 పరుగులతో దుమ్మురేపాడు. అజేయ అర్ధశకతంతో మెరిపించాడు. 9 ఫోర్లు బాదాడు. తంజిద్ హసన్ (35), మహమ్మదుల్లా (25) పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పౌల్ వాన్ మీకీరన్ తలా రెండు వికెట్లు తీశారు. టిమ్ ప్రింగిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ ముందు 160 పరుగుల లక్ష్యం ఉంది. ఆ జట్టును బంగ్లా కట్టడి చేస్తుందేమో చూడాలి.
సూపర్ 8 చేరిన భారత్, వెస్టిండీస్
గ్రూప్-ఏలో దుమ్మురేపిన భారత్ ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో సూపర్-8 చేరింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‍ల్లోనూ గెలిచి టీమిండియా అదరగొట్టింది. గ్రూప్ దశలో జూన్ 15న ఫ్లోరియా వేదికగా కెనడాతో భారత్ తలపడనుంది. గ్రూప్-సీలో వరుసగా మూడు మ్యాచ్‍లు గెలిచిన వెస్టిండీస్ కూడా సూపర్-8కు అర్హత సాధించింది.