Champions Trophy: డిఫెండింగ్ ఛాంపియన్.. పైగా సొంతగడ్డ.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ను ఆపతరమా? భారత్ తో పోరే కీలకం
Champions Trophy: అప్పుడెప్పుడో 2017లో చివరగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతోంది. ఇటీవల వన్డేల్లో జోరుమీదున్న ఆ జట్టు స్వదేశంలో చెలరేగాలని చూస్తోంది. కానీ భారత్ తో పోరు లో ఆ జట్టు గెలుస్తుందా? పాక్ బలాబలాలేంటీ?

ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమవుతోంది. మరో అయిదు రోజుల్లోనే ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ఆరంభమవుతుంది. హోస్ట్ పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగబోతోంది. స్వదేశంలో అదరగొట్టి టైటిల్ నిలబెట్టుకోవాలన్నదే ఆ జట్టు టార్గెట్. అంతే కాదు భారత్ ను ఓడించాలన్నది మరో ప్రధాన లక్ష్యం. మరి ఆ టార్గెట్ ను రీచ్ అయ్యే దిశగా పాక్ సాగుతుందా?
అదే బలం
పాకిస్థాన్ కు అతిపెద్ద స్ట్రెంత్ ఫాస్ట్ బౌలింగ్. షహీన్ షా అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్ పేస్ త్రయం అత్యంత ప్రమాదకరం. సొంతగడ్డపై ఈ ముగ్గురు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త బంతితో షహీన్ ను ఎదుర్కోవడం సవాలే. 59 వన్డేల్లో 119 వికెట్లు తీసిన షహీన్ తొలి పవర్ ప్లేలో 41 వికెట్లు పడగొట్టాడు. నసీం 20 మ్యాచ్ ల్లో 42 వికెట్లు, హారిస్ 42 మ్యాచ్ ల్లో 85 వికెట్లు సాధించాడు. మరోవైపు అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తో స్పిన్ డిపార్ట్ మెంట్ కూడా బలంగా ఉంది.
బ్యాటింగ్ కూడా
బ్యాటింగ్ లో కీలక ఆటగాడు బాబర్ ఆజంపై చాలా ఆశలున్నాయి. ఇక సొంతగడ్డపై 73 సగటుతో ఉన్న అతణ్ని ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు సవాలే. సాద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్, ఫకర్ జమాన్ కూడా బ్యాటింగ్ లో నిలకడగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ డెప్త్ కూడా ఎక్కువే. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయాలు పాక్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే.
ఇవే బలహీనతలు
గాయంతో సయిం ఆయూబ్ జట్టుకు దూరమయ్యాడు. అస్థిరత ఆ జట్టుకు అతిపెద్ద బలహీనత. ఒత్తిడికి చిత్తయి గెలిచే మ్యాచ్ లను ఎన్నో చేజార్చుకుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాక్ మరో ఐసీసీ టోర్నీల్లో గెలవలేదు. ఇక భారత్ పోరు ఆ జట్టుకు విషమ పరీక్ష. దుబాయ్ లో టీమ్ఇండియా చేతిలో ఓడితే స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవడంతో పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
పాకిస్థాన్ జట్టు: మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫకర్ జమాన్, సాద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీం అష్రఫ్, కమ్రాన్ గులాం, ఖుష్ దిల్ షా, అబ్రార్ అహ్మద్, హారిస్ రవూఫ్, మహమ్మద్ హస్నైన్, నసీం షా, షహీన్ షా అఫ్రిది.
సంబంధిత కథనం