Champions Trophy: సెన్సేషనల్ ఫామ్.. స్టార్ ఆటగాళ్లు.. పాతికేళ్ల నిరీక్షణకు కివీస్ ముగింపు పలికేనా?
Champions Trophy: అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో మరో కప్ ను ముద్దాడలేకపోయింది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి పాతికేళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది.

స్టార్ ఆటగాళ్లు, ఆల్ రౌండర్లతో నిండిన న్యూజిలాండ్ క్రికెట్ సెన్సేషనల్ ఫామ్ లో ఉంది. తాజాగా పాకిస్థాన్ లో ముక్కోణపు సిరీస్ ఛాంపియన్ గా నిలిచి రెట్టించిన జోష్ తో ఉంది. ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ ను వెనక్కి నెట్టి కివీస్ అజేయంగా టైటిల్ సొంతం చేసుకుంది. ఆ జట్టు 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది.
ఏడుగురు ఆల్ రౌండర్లు
ఏ జట్టులో అయినా ఒకరో ఇద్దరో మహా అయితే ముగ్గురు ఆల్ రౌండర్లుంటారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ ప్రకటించిన 15 మంది జట్టులో ఏకంగా ఏడుగురు ఆల్ రౌండర్లున్నారు. ఇదే ఆ జట్టు బలాన్ని చాటిచెబుతోంది. కెప్టెన్ శాంటర్న్, బ్రాస్ వెల్, చాప్ మన్, మిచెల్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నేథన్ స్మిత్ లాంటి ఆల్ రౌండర్లు ఆ జట్టుకు కొండంత అండ.
కేన్ మామ జోరు
న్యూజిలాండ్ కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్ జోరుమీదున్నాడు. ముక్కోణపు సిరీస్ లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ 7000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లి రికార్డు బ్రేక్ చేశాడు. విల్ యంగ్, కాన్వే కూడా ఫామ్ లో ఉండటంతో ఆ జట్టు అలవోకగా 300 కు పైగా పరుగులు చేస్తోంది. మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్ తో బ్యాటింగ్ లోతు కూడా ఎక్కువే. శాంట్నర్ సారథ్యంలోని స్పిన్ దళం కూడా మెరుగ్గా ఉంది.
అదే బలహీనత
పేస్ బౌలింగ్ లో అనుభవం లేకపోవడం న్యూజిలాండ్ బలహీనత. సీనియర్ పేస్ ద్వయం బౌల్ట్, సౌథీ రిటైర్మెంట్ ఆ జట్టును దెబ్బకొట్టింది. ఫెర్గూసన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. యువ పేస్ త్రయం డఫీ, ఒరోర్క్, స్మిత్ ఎలా రాణిస్తారో చూడాలి. మరోవైపు ముక్కోణపు సిరీస్ లో గాయం బారిన పడ్డ రచిన్ ఫిట్ నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూజిలాండ్ జట్టు: కాన్వే, లేథమ్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), బ్రాస్ వెల్, చాప్ మన్, డరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నేథన్ స్మిత్, జాకబ్ డఫీ, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, విల్ ఒరోర్క్
సంబంధిత కథనం