రెండో సారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో బరిలో దిగుతున్న దక్షిణాఫ్రికా అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. సీనియర్లు, జూనియర్లతో జట్టు మేళవింపు కుదిరింది. ఇన్నింగ్స్ నిర్మించే ఆటగాళ్లు, విధ్వంసకర ఆటతో చెలరేగే బ్యాటర్లున్నారు. ప్రపంచ స్థాయి బౌలర్లతో పటిష్ఠంగా ఉంది. సఫారీ జట్టు 1998 లో మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది.
బవుమా, మార్ క్రమ్, క్లాసెన్, మిల్లర్, డసెన్, స్టబ్స్.. ఇలాంటి ఉత్తమ బ్యాటర్లతో దక్షిణాఫ్రికా బలంగా కనిపిస్తోంది. బవుమా, మార్ క్రమ్ ఇన్నింగ్స్ నిర్మిస్తే.. క్లాసెన్, మిల్లర్ మెరుపు షాట్లతో ఫలితాన్ని తారుమారు చేయగలరు. వన్డేల్లో 300 పరుగులు దాటడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. 2023 వన్డే ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా అలవోకగా 300 పరుగులు చేయడం చూశాం.
ప్రమాదకర పేసర్లు రబాడ, ఎంగిడి సఫారీ జట్టుకు బౌలింగ్ లో ఎంతో కీలకం. ఇక పేస్ ఆల్ రౌండర్ యాన్సెన్ ఇటీవల నిలకడగా రాణిస్తున్నాడు. కేశవ్ మహరాజ్, షంసితో స్పిన్ విభాగమూ పటిష్ఠంగానే కనిపిస్తోంది. యాన్సెన్ తో పాటు కార్బిన్, మార్ క్రమ్, ముల్దర్ రూపంలో నాణ్యమైన ఆల్ రౌండర్లున్నారు. పేపర్ మీద స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా సఫారీ జట్టు మైదానంలో జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
1998 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత దక్షిణాఫ్రికా మరో ఐసీసీ టోర్నీ గెలవలేకపోయింది. వన్డే, టీ20 ప్రపంచకప్ ల్లో నాకౌట్ చేరినా ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో ఆ జట్టుపై చోకర్స్ అనే ముద్ర పడింది. కీలక సమయంలో ఒత్తిడికి చిత్తవడం ఆ జట్టు ప్రధాన బలహీనత.
2024 టీ20 ప్రపంచకప్ లో ఇలాగే టీమ్ఇండియా చేతిలో ఓడింది. ఇటీవల స్వదేశంలో పాకిస్థాన్ చేతిలో సిరీస్ కోల్పోయింది. తాజాగా ట్రై సిరీస్ లో ఫైనల్ చేరడంలో విఫలమైంది. ఇక పేసర్ నోకియా గాయంతో దూరమవడం కూడా ఆ జట్టుకు చేటు చేసేదే.
సంబంధిత కథనం