Suryakumar Yadav: టీమిండియా మాజీ వికెట్ కీపర్, సెలక్షన్ కమిటీ మాజీ చీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరల్డ్ కప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ కచ్చితంగా ఉంటాడని అతడు అనడం విశేషం. వన్డేల్లో తన రికార్డు దారుణంగా ఉందని సూర్యనే చెప్పిన నేపథ్యంలో ఎమ్మెస్కే కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
రాహుల్, అయ్యర్, పంత్ లాంటి వాళ్లకు గాయాలు కావడంతో సూర్యకు వన్డే జట్టులోనూ చోటు దక్కుతోంది. అయితే వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కు సూర్య ఎంపిక అనుమానంగానే కనిపిస్తోంది. కానీ ఎమ్మెస్కే వాదన మాత్రం మరోలా ఉంది. అతడో మ్యాచ్ విన్నర్ అని ప్రసాద్ అనడం విశేషం.
"సూర్యకుమర్ వరల్డ్ కప్ జట్టులో ఉంటాడని వంద శాతం కచ్చితంగా చెప్పగలను. టీ20ల్లో అతడు నంబర్ వన్ బ్యాటర్. అతనిలోని స్పెషల్ టాలెంట్ ను ఐపీఎల్లో, అంతర్జాతీయ టీ20ల్లో చూశాం. ఒత్తిడిని అధిగమించే అతని సామర్థ్యం కూడా మనకు తెలుసు" అని ఇండియా టుడేతో మాట్లాడుతూ ఎమ్మెస్కే అన్నాడు. సూర్య ఇప్పటి వరకూ 24 వన్డే ఇన్నింగ్స్ ఆడగా.. అందులో అత్యధికంగా 11సార్లు ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు.
మొత్తంగా ఐదు స్థానాల్లో సూర్య బ్యాటింగ్ చేసినా ఎక్కడా సక్సెస్ కాలేదు. మొదటి ఆరు వన్డేల్లో బాగానే ఆడినా తర్వాత గాడి తప్పాడు. అయితే ఇప్పటికీ జట్టులో తన బాధ్యత ఏంటో సూర్యకు తెలియదని, ఒకసారి అది తెలిస్తే అతడో మ్యాచ్ విన్నర్ అవుతాడని ప్రసాద్ అన్నాడు.
"సూర్యకు ఇప్పటికీ జట్టులో తన బాధ్యతేంటో తెలియదని నేననుకుంటున్నాను. తన బాధ్యతేంటో తెలుసుకొని, అందుకు తగినట్లు ఆడితే వరల్డ్ కప్ లో అతడు ఇండియా తరఫున అతిపెద్ద మ్యాచ్ విన్నర్, బెస్ట్ ఫినిషర్ అవుతాడు. అతనికి ఆ సామర్థ్యం ఉంది. అతనికి మన మద్దతు కావాలి.
ప్రస్తుతం రోహిత్, ద్రవిడ్ చేస్తున్నది బాగుంది. అతనికి తన బాధ్యతపై స్పష్టత ఇచ్చే ఉంటారు. అది అతనికి సాయపడుతుంది. ఎందుకంటే ఫినిషర్ రోల్ ను అతడు బాగా ఎంజాయ్ చేస్తాడు. సూర్యకు ఇది ఊరట కలిగించే విషయం. అతడు అందుకు తగినట్లు ప్లానింగ్ మొదలుపెడతాడు" అని ప్రసాద్ అన్నాడు.