T20 Cricketer of The Year:టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో సూర్యకుమార్ - ఈ లిస్ట్‌లోని మిగిలిన క్రికెటర్లు వీళ్లే
T20 Cricketer of The Year: ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు రేసులో టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.
T20 Cricketer of The Year: మెన్స్ 2023 టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినేషన్స్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో టీమిండియా హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. సూర్యకుమార్‌తో పాటు న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్‌మన్, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాతో పాటు ఉగాండ క్రికెటర్ రమ్‌జానీ చోటు దక్కించుకున్నారు. వీరిలో సూర్యకుమార్ యాదవ్‌కే అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఓటింగ్‌ను బట్టి విజేతను అనౌన్స్ చేశారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విన్నర్‌గా నిలుస్తారు.
2023లో 733 రన్స్…
2023లో సూర్యకుమార్ యాదవ్ 17 ఇన్సింగ్స్‌లలోనే 733 రన్స్ చేశాడు. 48.86 యావరేజ్, 155.95 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు. గత ఏడాది జనవరిలో శ్రీలంకపై టీ20ల్లో 51 బాల్స్‌లోనే 112 రన్స్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. టీ20ల్లో రోహిత్ శర్మ తర్వాత అత్యంత వేగంగా సెంచరీ సాధించిన టీమిండియా క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
నాలుగు సెంచరీలు…
ఓవరాల్‌గా టీమిండియా తరఫున 60 ఇంటర్‌నేషనల్ టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 2141 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం గమనార్హం. టీమిండియా తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్స్ లిస్ట్‌లో సూర్యకుమార్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో నాలుగు సెంచరీలు చేసిన సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం సెంచరీల బోణీ కొట్టలేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్నాడు.
కెప్టెన్సీ బాధ్యతలు...
వన్డే ప్రపంచ కప్ లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌లకు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. రెగ్యులర్ టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయపడటంతో బీసీసీఐ సూర్యకుమార్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు సూర్యకుమార్. దాంతో ఈ జనవరిలో అప్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు అతడు దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్‌కు జడేజా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
సికిందర్ రజాతో పాటు…
మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ లిస్ట్‌లో సూర్యకుమార్‌తో పోటీపడుతోన్న సికిందర్ రజా 11 మ్యాచుల్లో 515 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు తీశాడు. మార్క్ చాప్‌మన్ 19 ఇన్నింగ్స్‌లలో 576 రన్స్ చేశాడు. వీరిద్దరు సూర్య కుమార్ కంటే తక్కువ పరుగులే చేశారు. ఉగాండ క్రికెటర్ రమ్‌జానీ మాత్రం బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. 2023 ఏడాదిలో టీ20ల్లో 55 వికెట్లు తీశాడు.