Suryakumar Yadav: డ్రెస్సింగ్ రూమ్‌లో సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించిన హార్దిక్ పాండ్యా, గంభీర్
Suryakumar Yadav: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై డ్రెస్సింగ్ రూమ్ లో ప్రశంసలు కురిపించారు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Suryakumar Yadav: శ్రీలంకతో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్ సెలబ్రేషన్స్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో హెడ్ కోచ్ గంభీర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టును ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మొత్తం టీమ్ తోపాటు సూర్య కెప్టెన్సీని ఈ ఇద్దరూ తెగ ప్రశంసించారు.
సూర్య కెప్టెన్సీ అద్భుతం
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను ఇండియా క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఓటమి తప్పదనుకున్న చివరి టీ20లో సూపర్ ఓవర్లో గెలిచి అద్భుతమే చేసింది. అయితే ఈ మ్యాచ్ లో చివరి రెండు ఓవర్లలో ఒకటి రింకు సింగ్ కు ఇచ్చి, మరొకటి తానే వేసిన సూర్య.. శ్రీలంక బ్యాటర్లను ఆశ్చర్యానికి గురి చేశాడు. నిజానికి అదృష్టవశాత్తూ ఈ ఎత్తుగడ ఫలించి మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్ కు దారి తీసింది.
ఇదే విషయాన్ని చెబుతూ మ్యాచ్ తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. సూర్యను ప్రశంసించాడు. "గౌతీ భాయ్ చెప్పినట్లు సూర్య చాలా బాగా చేశావ్. ముఖ్యంగా బౌలర్లను రొటేట్ చేసిన తీరు బాగుంది. చివరి రెండు ఓవర్లలో బౌలర్లపై నమ్మకం ఉంచావు. ఓ బౌలింగ్ యూనిట్ గా టీమ్ అద్భుతంగా రాణించింది" అని హార్దిక్ పాండ్యా అనడం ఓ వీడియోలో చూడొచ్చు.
అంతకుముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సిరీస్ క్లీన్ స్వీప్ పై సూర్యతోపాటు జట్టును అభినందించాడు. "కంగ్రాచులేషన్స్ గయ్స్.. సూర్యకు కూడా కంగ్రాచులేషన్స్. అద్భుతమైన కెప్టెన్సీ. బ్యాట్ తోనూ రాణించాడు. సరిగ్గా నేను చెప్పినట్లే చేశారు. ప్రతి బంతికీ పోరాడితేనే ఇలాంటి మ్యాచ్ లను మనం చూడగలం. అయితే ఇలాంటి వికెట్లపై మనం ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. వికెట్ ను అంచనా వేసి ఎంత స్కోరు మంచిదో ముందే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది" అని గంభీర్ అన్నాడు.
కెప్టెన్‌గా సూర్య సక్సెస్
శ్రీలంకతో సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ వదిలేసిన టీ20 కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానే దీనికి సరైనోడన్న అభిప్రాయాలు వచ్చాయి. కానీ హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం అనూహ్యంగా సూర్య పేరును తెరపైకి తీసుకొచ్చారు. అతనికే కెప్టెన్సీ అప్పగించారు.
ఈ పరిస్థితుల్లో సూర్యతో హార్దిక్ ఎలా ఉంటాడో అన్న ఆందోళనా కలిగింది. కానీ మొదటి నుంచీ అతనికి మద్దతుగానే నిలిచాడు. ఇప్పుడు సిరీస్ గెలిచిన తర్వాత కూడా అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు. మొత్తానికి టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్ గా సూర్య మొదటి సిరీస్ నే క్లీన్ స్వీప్ చేసి అదరగొట్టాడు. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ దిశగా టీమ్ కు మంచి ఆరంభం అందించాడు. తనకు కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయమే అని సూర్య నిరూపించాడు. మరి ఇదే జోరును అతడు భవిష్యత్తులోనూ కొనసాగిస్తాడేమో చూడాలి.