Suryakumar Captaincy: కెప్టెన్సీకి నో చెప్పిన రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా టూర్‌కూ సూర్యకే కెప్టెన్సీ
Suryakumar Captaincy: ఆస్ట్రేలియాతో సిరీస్ ముగియగానే సౌతాఫ్రికా టూర్ కోసం వెళ్లనుంది టీమిండియా. అయితే ఈ టూర్లో టీ20 సిరీస్ కు కెప్టెన్ గా ఉండటానికి రోహిత్ విముఖత చూపిస్తుండటంతో సూర్యకుమారే కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Suryakumar Captaincy: వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ కు సరికొత్త టీమిండియాను మనం చూస్తున్నాం. రోహిత్ కు రెస్ట్, హార్దిక్ కు గాయంతో సూర్యకుమార్ కెప్టెన్సీలో ఈ సిరీస్ ఆడుతోంది. అయితే దీని తర్వాత సౌతాఫ్రికా టూర్లో భాగంగా ఇండియా మరో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ ల సిరీస్ లు ఆడాల్సి ఉంది.
మరి సౌతాఫ్రికా టూర్ కోసమైనా రోహిత్ తిరిగొస్తాడా? ఒకవేళ వస్తే హార్దిక్ అందుబాటులో లేని నేపథ్యంలో టీ20 సిరీస్ కు కూడా అతడే కెప్టెన్ గా ఉంటాడా? ఒకవేళ అలా ఉంటే తర్వాత జరిగే వన్డే సిరీస్ కు అతడు దూరంగా ఉంటాడా? ఈ సందేహాలే ప్రస్తుతం నెలకొన్నాయి. రోహిత్ ను కెప్టెన్ గా ఒప్పించడానికి బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌కూ రోహితే కెప్టెన్?
ఒకవేళ సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో కెప్టెన్ గా ఉండటానికి రోహిత్ శర్మ అంగీకరిస్తే.. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు కూడా అతన్నే కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ చూస్తోంది. అయితే గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత ఇండియా తరఫున రోహిత్ మరో టీ20 ఆడలేదు. దీంతో హార్దిక్ పాండ్యా ఈ ఫార్మాట్లో కెప్టెన్ గా ఉంటున్నాడు.
వరల్డ్ కప్ లో గాయపడిన అతడు అందుబాటులో లేకపోవడంతో సూర్యకుమార్ ను కెప్టెన్ ను చేశారు. అయితే సౌతాఫ్రికా సిరీస్ కు మాత్రం రోహిత్ ను కెప్టెన్ గా ఉండాలని బోర్డు కోరుతోంది. కానీ దీనికి అతడు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ కచ్చితంగా నో చెబితే మాత్రం సూర్యకుమార్ నే ఈ సిరీస్ కు కూడా కెప్టెన్ గా నియమించనున్నారు.
టీ20 ఫార్మాట్ ఆడటానికి రోహిత్ అసలు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇక సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కూడా ఉంది. ఈ మధ్యే వరల్డ్ కప్ ముగిసిన నేపథ్యంలో వన్డేలకు అసలు ప్రాముఖ్యతే ఉండదు. ఈ నేపథ్యంలో ఒకవేళ రోహిత్ టీ20 సిరీస్ ఆడేందుకు అంగీకరిస్తే తర్వాత వన్డే సిరీస్ కు దూరంగా ఉంటాడనీ తెలుస్తోంది. ఈ వైట్ బాల్ సిరీస్ లు ముగిసిన తర్వాత ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. మొత్తానికి మరోసారి టీమిండియాలో కెప్టెన్సీ డైలమా నెలకొంది.