ఐపీఎల్ 2025 లో ముంబయి ఇండియన్స్ కు కొత్త కెప్టెన్. హార్దిక్ పాండ్య స్థానంలో సూర్య కుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ కెప్టెన్సీ ఛేంజ్ ఒక్క మ్యాచ్ కు మాత్రమే. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా సూర్య వ్యవహరిస్తాడు. మార్చి 23న చెపాక్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ కు మాత్రమే సూర్య కెప్టెన్.
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్ లో మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కు మాత్రమే సూర్య కెప్టెన్. 2024 ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో ముంబయి స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పై శిక్ష పడింది. మూడోసారి అలా జరగడంతో ముంబయి కెప్టెన్ హార్దిక్ పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. అందుకే ఈ సీజన్ లో ముంబయి తొలి మ్యాచ్ లో హార్దిక్ ఆడటం లేదు.
నిజానికి హార్దిక్ పాండ్యపై ఓ మ్యాచ్ వేటు పడటంతో ఈ సీజన్ లో ముంబయి తొలి మ్యాచ్ లో ఆ జట్టుకు రోహిత్ కెప్టెన్ గా ఉంటాడనే అంతా అనుకున్నారు. కానీ ఆ బాధ్యతను సూర్య కుమార్ కు అప్పగించారు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు సూర్యనే కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024కు ముందు రోహిత్ ను తప్పించి హార్దిక్ ను కెప్టెన్ గా చేయడం కలకలం రేపింది.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆ టీమ్ ను అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. అలాంటిది గతేడాది గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ను రప్పించి మరీ ముంబయి కెప్టెన్ గా చేశారు. దీంతో ముంబయి ఇండియన్స్ ఓనర్స్ పై రోహిత్ ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఆ టీమ్ జెర్సీలను తగలబెట్టారు. స్టేడియాల్లో హార్దిక్ ను దారుణంగా ట్రోల్ చేశారు. ఎక్కడ కనిపించినా ఎగతాళి చేశారు.
సూర్య కుమార్ ముంబయి ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ కు ముందు ముంబయి సూర్యతో పాటు హార్దిక్, రోహిత్, తిలక్ వర్మ, బుమ్రాను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ గా ఉన్న సూర్య.. 2023 ఐపీఎల్ లో ఓ మ్యాచ్ లో ముంబయిని నడిపించాడు.
సంబంధిత కథనం