ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో మరోసారి ఎంఎస్ ధోని ఫైర్ చూపిస్తాడని సురేష్ రైనా ఆశిస్తున్నాడు. ఈ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ స్టార్ ఆటగాడు.. 43 ఏళ్ల లెజెండ్ ధోని గురించి ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ఇటీవల ధోనీని రైనా కలిశాడు. ఇప్పుడు రైనా చెప్పిన రహస్యం తెలిస్తే ధోని ఫ్యాన్స్ మరింత కాలర్ ఎగరేస్తారు.
"ధోని గురించి ఒక సీక్రెట్ చెప్తా. అతని ఫిట్ నెస్, వికెట్ కీపింగ్ స్కిల్స్, కెప్టెన్సీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ అతను తన బ్యాట్ ను లిఫ్ట్ చేసే సమయంలో ఎంతటి పవర్ వస్తుందో చాలా మంది గమనించలేదు. ప్రాక్టీస్ తోనే అది సాధ్యమవుతుంది. ఐపీఎల్ లో సీఎస్కే ప్రాక్టీస్ కోసం నెల రోజుల ముందే ధోని చెన్నైకి వస్తాడు. దీని కోసం కమర్షియల్ యాడ్స్ షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాడు’’ అని రైనా ఇండియా టుడేతో అన్నాడు.
కమర్షియల్ యాడ్స్ చేస్తుంటే కోట్ల రూపాయాలు వస్తాయి. అది కూడా ధోని లాంటి లెజెండ్ అంటే కంపెనీలు ఎంతైనా ఆఫర్ చేస్తాయి. కానీ ధోని మాత్రం ఐపీఎల్ కోసం ఆ షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకునేవాడని రైనా చెప్పాడు.
‘‘నేను భారత్, సీఎస్కే తరఫున ఆడుతున్నప్పుడు ధోనీతో కలిసి షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని చెన్నై వెళ్లేవాళ్లం. రోజూ మూడు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లం. ప్రతి వారం నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఆ తర్వాత మిగిలిన రెండు రోజుల్లో మ్యాచ్ సిమ్యులేషన్స్ చేస్తాం. ఆ కఠినమైన పిచ్ లపై మేం స్పిన్నర్లను ఎదుర్కొన్నాం’’ రైనా తెలిపాడు.
‘‘గత ఏడాది ధోని ఎన్నో సిక్సర్లు బాదాడు. ఈ సారి కూడా అతను చాలా బలంగా కనిపిస్తున్నాడు. సీఎస్కే కు ఆడేందుకు ఎంతో పట్టుదలతో కనిపిస్తున్నాడు. టీమ్ ఆర్డర్ ఒకటి నుంచి ఆరు వరకు బలంగా ఉంది. ఈ ఏడాది కూడా తలా నుంచి హెలికాప్టర్ షాట్లు చూస్తామని అనుకుంటున్నా’’ అని రైనా చెప్పాడు.
ఐపీఎల్ 2025లోనూ ధోని ఫినిషర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. 2024లో ధోని 11 ఇన్నింగ్స్ ల్లో 220.54 స్ట్రైక్ రేట్ తో 161 పరుగులు చేశాడు. ధనాధన్ షాట్లతో చెలరేగాడు.
సంబంధిత కథనం