ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం (మార్చి 23) ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆ టీమ్ 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ట్రావిస్ హెడ్ (67) కూడా సత్తాచాటాడు.
ఛేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కూడా తగ్గేదేలే అన్నట్లు ఆడింది. కానీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేయగలిగింది. సాధారణంగా అయితే ఐపీఎల్ లో ఇంత స్కోరు చేసిన జట్టు గెలుస్తుంది. కానీ సన్‌రైజర్స్ అసాధారణ టార్గెట్ విధించడంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు. ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 70), ‘ఇంపాక్ట్ ప్లేయర్’ శాంసన్ (37 బంతుల్లో 66), హెట్ మయర్ (23 బంతుల్లో 42) పోరాడినా ఫలితం లేకపోయింది.
భారీ ఛేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ గొప్పగా పోరాడింది. షమి వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే శాంసన్ వరుసగా 6, 4, 4 బాదాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే సిమర్జీత్ సింగ్ జైస్వాల్ (1), పరాగ్ (4)ను ఔట్ చేసి రాజస్థాన్ ను గట్టి దెబ్బ కొట్టాడు. నితీశ్ రాణా (11)ను షమి వెనక్కిపంపడంతో 50/3తో రాయల్స్ విజయం కష్టమే అనిపించింది. కానీ శాంసన్, జురెల్ గొప్ప ప్రయత్నమే చేశారు.
రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న ధ్రువ్ జురెల్ జూలు విదిల్చాడు. కమిన్స్ బౌలింగ్ లో వరుసగా 6, 4, 4 కొట్టిన ఈ యంగ్ బ్యాటర్.. శాంసన్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 9 ఓవర్లకే రాజస్థాన్ స్కోరు 100 దాటింది. శాంసన్, జురెల్ హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేశారు. సిమర్జీత్ బౌలింగ్ లో జూరెల్ వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. కానీ 3 బంతుల వ్యవధిలో శాంసన్, జూరెల్ ఔటవడంతో రాజస్థాన్ ఆశలు కూలాయి.
సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో రాజస్థాన్ ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. చివర్లో హెట్ మయర్, శుభమ్ దూబె (11 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడ్డాయి. సన్ రైజర్స్ బౌలర్లలో సిమర్జీత్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటేనే బ్యాటింగ్ విధ్వంసానికి మారుపేరుగా మారింది. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ప్రమాదకర ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ (11 బంతుల్లో 22) భారీ షాట్లతో పరుగుల వేట కొనసాగించారు. అభిషేక్ ఔటైన తర్వాత హెడ్ దంచుడు వేరే లెవల్ కు చేరింది.
ప్రమాదకర పేసర్ ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో హెడ్ 4 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. ఈ సిక్సర్ 105 మీటర్ల దూరం వెళ్లడం విశేషం. పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ 94/1తో నిలిచింది. 21 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టిన హెడ్ 67 పరుగులు చేశాడు. అతణ్ని తుషార్ దేశ్ పాండే ఔట్ చేశాడు.
మెగా వేలంలో రూ.11.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోనుగోలు చేసిన ఇషాన్ కిషన్ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌండరీలతోనే సాగిపోయాడు. మరో ఎండ్ లో వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ (15 బంతుల్లో 30) కూడా సత్తాచాటాడు. నితీశ్ ఔటైనా ఇషాన్ వీర బాదుడు కొనసాగింది. 14.1 ఓవర్లలోనే సన్‌రైజర్స్ స్కోరు 200కు చేరుకుంది.
15వ ఓవర్లోనే సన్‌రైజర్స్ స్కోరు 200 దాటడంతో టీమ్ 300 పరుగులు చేస్తుందేమో అనిపించింది. కానీ చివర్లో సన్‌రైజర్స్ దూకుడు కొనసాగించినా 300 మైల్ స్టోన్ చేరుకోలేకపోయింది. ఇషాన్ తో కలిసి క్లాసెన్ (14 బంతుల్లో 34) పరుగులు తుపాన్ కొనసాగేలా చూశాడు. క్లాసెన్ ఔటైనా.. ఇషాన్ మాత్రం టాప్ గేర్ లోనే కొనసాగాడు.
చివర్లో ఇషాన్ సెంచరీపై ఉత్కంఠ నెలకొంది. కానీ సందీప్ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, రెండు పరుగులతో ఐపీఎల్ కెరీర్లో ఫస్ట్ సెంచరీ అందుకున్నాడు. చివరి వరకూ నిలబడి జట్టు స్కోరును 280 దాటించాడు. ఐపీఎల్ లో తమ అత్యధిక స్కోరు రికార్డుకు సన్‌రైజర్స్ ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ 3, తీక్షణ 2 వికెట్లు తీశారు.
సంబంధిత కథనం