ఫైనల్లో సన్ రైజర్స్.. కావ్య హ్యాపీ.. దక్షిణాఫ్రికా టీ20లీగ్ లో తగ్గేదేలే.. హ్యాట్రిక్ టైటిల్ పై గురి
Sunrisers: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు తిరుగేలేదు. ఈ ఎస్ఏ20 ఆరంభమైనప్పటి నుంచి ఛాంపియన్ గా నిలుస్తున్న ఆ జట్టు ఈ సీజన్ లోనూ ఫైనల్ చేరింది. హ్యాట్రిక్ టైటిల్ పై కన్నేసింది. ఈ జట్టుకు సన్ గ్రూప్ కు చెందిన కావ్య మారన్ యజమాని.

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు కావ్య మారన్ ఫుల్ హ్యాపీగా ఉంది. వివిధ టీ20 లీగ్ ల్లో ఆ గ్రూప్ కు చెందిన జట్లు సూపర్ ఫర్ ఫార్మెన్స్ తో దూసుకెళ్తున్నాయి. ఇటు గత ఐపీఎల్ సీజన్ లో పరుగుల వరద పారించిన సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎస్ఏ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా మూడో సారి ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-2 లో పార్ల్ రాయల్స్ ను ఆ జట్టు చిత్తు చేసింది.
రెండు సార్లు సన్ రైజర్సే
2023లో ఆరంభమైన ఎస్ఏ20 లీగ్ లో ఇప్పటివరకూ రెండు సీజన్లలోనూ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్ గా నిలిచింది. డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ఎమ్ఐ కేప్ టౌన్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు ఈ లీగ్ లో తలపడుతున్నాయి. 2023 ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్ పై గెలిచిన సన్ రైజర్స్.. గతేడాది తుదిపోరులో డర్బన్ సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.
కావ్యకు మూడు క్రికెట్ జట్లు
సన్ గ్రూప్ కు చెందిన కావ్య మారన్ క్రికెట్ పై ఇంట్రస్ట్ చూపిస్తుందని సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్ ల సమయంలో ఆమె చేసే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. దీంతో ఆమెకు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇప్పుడు కావ్య మూడు క్రికెట్ జట్లకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటోంది.
ఇక్కడ హైదరాబాద్
2012 అక్టోబర్ లో ఐపీఎల్ లో ఆడే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీని సన్ గ్రూప్ సొంతం చేసుకుంది. 2022 జులై లో ఎస్ఏ20 కోసం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ను దక్కించుకుంది. దక్షిణాఫ్రికాలో ఈ జట్టు మ్యాచ్ ల సమయంలో అక్కడి స్టేడియాల్లో కావ్య సందడి చేస్తుంది. ఇక తాజాగా ఇంగ్లండ్ లోని ‘ది హండ్రెడ్’ లీగ్ లో పోటీపడే నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ ను కావ్య కొనుగోలు చేసింది. దీనికోసం ఆమె రూ.109.4 కోట్లు ఖర్చు పెట్టిందనే వార్తలొస్తున్నాయి.