కోల్‌క‌తా ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవం - పోరాడి ఓడిన ఢిల్లీ - సునీల్ న‌రైన్ మ్యాజిక్‌- డుప్లెసిస్‌, అక్ష‌ర్ ప‌టేల్ పోరాటం వృథా-sunil narine shines as kolkata knight riders beat delhi capitals by 14 runs in ipl 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  కోల్‌క‌తా ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవం - పోరాడి ఓడిన ఢిల్లీ - సునీల్ న‌రైన్ మ్యాజిక్‌- డుప్లెసిస్‌, అక్ష‌ర్ ప‌టేల్ పోరాటం వృథా

కోల్‌క‌తా ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవం - పోరాడి ఓడిన ఢిల్లీ - సునీల్ న‌రైన్ మ్యాజిక్‌- డుప్లెసిస్‌, అక్ష‌ర్ ప‌టేల్ పోరాటం వృథా

Nelki Naresh HT Telugu

ఐపీఎల్ 2025లో మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 14 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ప్లేఆఫ్స్ ఆశ‌లు కాపాడుకుంది. బ్యాటింగ్‌లో ర‌ఘువ‌న్షీ, రింకు సింగ్‌, బౌలింగ్‌లో న‌రైన్ రాణించి కోల్‌క‌తాను గెలిపించారు.

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్

ప్లేఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ అద‌ర‌గొట్టింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 14 ప‌రుగులు తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి 204 ప‌రుగులు భారీ స్కోరు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో పోరాడిన ఢిల్లీ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 190 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 14 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

తొలి ఓవ‌ర్‌లోనే షాక్‌...

ల‌క్ష్య ఛేద‌న‌లో తొలి ఓవ‌ర్‌లోనే ఢిల్లీకి షాక్ త‌గిలింది. ఫ‌స్ట్ బాల్‌కే ఫోర్ కొట్టి జోరు మీద క‌నిపించిన అభిషేక్ పొరెల్‌ను రెండో బంతికే పెవిలియ‌న్ పంపించాడు అంకుల్ రాయ్‌. తొలి ఓవ‌ర్‌ను స్పిన్న‌ర్‌తో వేయించిన కోల్‌క‌తా ప్లాన్ స‌క్సెస్ అయ్యింది. క్రీజులో కుదురుకుంటున్న‌ట్లే క‌నిపించిన క‌ర‌ణ్ నాయ‌ర్ కూడా 15 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించ‌గా...డీఆర్ఎస్‌లో ఎల్‌బీడ‌బ్యూగా తేల‌డంతో క‌ర‌ణ్ నాయ‌ర్‌కు నిరాశే మిగిలింది. స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ లేని ప‌రుగుకు ప్ర‌య‌త్నించి ర‌నౌట్ కావ‌డం ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొంప ముంచింది.

అక్ష‌ర్ ప‌టేల్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌...

ఓ వైపు వికెట్లు ప‌డుతోన్న క్రీజుతో పాతుకుపోయిన డుప్లెసిస్‌...కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్‌తో క‌లిసి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. 60 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీని ఇద్ద‌రు క‌లిసి ఆదుకున్నారు. ఢిల్లీ స్కోరును వంద ప‌రుగులు దాటించారు. ధాటిగా ఆడుతోన్న అక్ష‌ర్ ప‌టేల్‌ను న‌రైన్ బోల్తా కొట్టించాడు. 23 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 43 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు అక్ష‌ర్ ప‌టేల్‌.

విప్ర‌జ్ నిగ‌మ్ మెరుపు ఇన్నింగ్స్‌...

విప్ర‌జ్ నిగ‌మ్ బ్యాట్ ఝులిపించ‌డంతో ఢిల్లీ గెలిచేలా క‌నిపించింది. కానీ కీల‌క స‌మ‌యంలో డుప్లెసిస్ ఔట్ కావ‌డం, మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫ‌లం కావ‌డంతో ఢిల్లీ ఓట‌మి పాలైంది. డుప్లెసిస్ 43 బాల్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 62 ప‌రుగులు చేశాడు. విప్ర‌జ్ నిగ‌ల్ 19 బాల్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 38 ర‌న్స్ తో రాణించాడు. స్ట‌బ్స్‌, అశుతోష్ శ‌ర్మ విఫ‌లం కావ‌డం ఢిల్లీని దెబ్బ‌తీసింది.

నరైన్ మూడు వికెట్లు...

కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో న‌రైన్ మూడు వికెట్లు తీయ‌డంతో పాటు రాహుల్‌ను ర‌నౌట్ చేశాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి రెండు వికెట్లు ద‌క్కాయి.

టాప్ స్కోర‌ర్‌...

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 204 ప‌రుగులు చేశారు. కోల్‌క‌తా బ్యాట‌ర్లు స‌మిష్టిగా రాణించారు. ఓపెన‌ర్లు గుర్భాజ్ 26, న‌రైన్ 27 ర‌న్స్ చేశారు. ర‌ఘువ‌న్షీ 32 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 44 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

రింకు సింగ్ 36 ర‌న్స్‌తో రాణించాడు. ర‌హానే 14 బాల్స్‌లో 26 ర‌న్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆరంభంలో తేలిపోయిన ఢిల్లీ బౌల‌ర్లు చివ‌ర‌లో విజృంభించారు. చివ‌రి ఓవ‌ర్‌లో కోల్‌క‌తా మూడు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో స్టార్క్ 3, అక్ష‌ర్ ప‌టేల్‌, విప్ర‌జ్ నిగ‌ల్ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్