రిషబ్ పంత్.. ఈ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లాండ్ తో హెడింగ్లీలో జరుగుతున్న ఫస్ట్ టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ అతను సెంచరీలు బాదడమే అందుకు కారణం. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ హిస్టరీ క్రియేట్ చేశాడు. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెండో వికెట్ కీపర్ గా నిలిచాడు. అయితే నాలుగో రోజు (జూన్ 23) ఆటలో పంత్ సెంచరీ తర్వాత ఫ్లిప్ చేయాలని దగ్గజం సునీల్ గవాస్కర్ కోరడం కనిపించింది.
2022 డిసెంబర్ లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్న పంత్ మళ్లీ అసాధారణ పోరాట పటమితో కోలుకుని క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ చివరి మ్యాచ్ లో సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు కొడుతూ సంబరాలు చేసుకున్నాడు పంత్. ఇప్పుడు ఇంగ్లాండ్ తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ తర్వాత కూడా అలాగే ఫ్లిప్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ హండ్రెడ్ తర్వాత అలాగే సంబరాలు చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ వెరైటీగా కన్నుపై చేయి పెట్టుకుని సెలబ్రేషన్ చేసుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ తర్వాత ఫ్లిప్ చేయాలని స్టాండ్స్ లో నుంచి సునీల్ గవాస్కర్ రిక్వెస్ట్ చేశాడు. కానీ తర్వాత ఎప్పుడైనా అని పంత్ సైగలు చేశాడు. దీనిపై గవాస్కర్ సోమవారం ఆట తర్వాత స్పందించాడు.
‘‘నా ఉద్దేశ్యం ఏమిటంటే, ఎవరైనా భారతీయుడు బాగా రాణిస్తే, మీరు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే భారతదేశంలో క్రికెట్ పట్ల ఉన్న అభిరుచి మీకు తెలుసు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి ఫ్యాన్ గా ఉంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. పంత్ చూడండి.. ప్రమాదం తర్వాత మళ్లీ ఆడుతున్నాడు. నేను కూడా ఆ ఫ్లిప్ కోసం ఎదురు చూశా. అతను డబుల్ ఫ్లిప్ ఇవ్వనప్పుడు నేను నిరాశ చెందా’’ అని గవాస్కర్ అన్నాడు.
‘‘మీ సంబరాలు కూడా ఇదే విధంగా ఉన్నాయని అనుకుంటున్నా’’ అని అప్పుడు గవాస్కర్ ను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అడిగాడు. అందుకు గవాస్కర్.. ‘‘లేదు. థ్యాంక్ గాడ్. నేను బ్యాక్ ఫ్లిప్ చేయకుండా ఉండటానికి ప్రయత్నించా. కానీ అవకాశం లేదు. నా వయస్సులో నేను బ్యాక్ స్టాండ్ (వెనక్కి చేతులపై వాలి ఎగరడం) చేసేవాడిని. ఇప్పుడు అదే చేద్దామనుకున్నా. ట్రై చేశా కానీ సాధ్యం కాలేదు. ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు మీ ముందే చూపించేవాణ్ని’’ అని పేర్కొన్నాడు.
సంబంధిత కథనం