Sunil Gavaskar Dance: షారుఖ్ పాటకు స్టేజ్‍పై డ్యాన్స్ చేసిన గవాస్కర్.. గొంతుకలిపిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్
Sunil Gavaskar Dance: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్టేజ్‍పైనే డ్యాన్స్ చేశారు. వాంఖెడే స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్టెప్స్ వేశారు. సచిన్ టెండూల్కర్ కాస్త పాట పాడారు. ఈ వీడియో వైరల్‍గా మారింది.
ముంబైలోని ప్రముఖ వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం గ్రాండ్‍గా జరిగింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముంబైకి చెందిన భారత దిగ్గజ క్రికెటర్లు, ప్రస్తుత ప్లేయర్లు హాజరయ్యారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి సహా మరికొందరు ఈ ఈవెంట్‍కు వచ్చారు. భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సహా మరికొందరు ముంబై ప్లేయర్లు హాజరయ్యారు. ఈ సెలెబ్రేషన్లలో డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచారు లెజెండ్ సునీల్ గవాస్కర్. పాటకు గొంతుకలిపారు సచిన్.
ఓం శాంతి ఓం పాటకు గవాస్కర్ స్టెప్స్
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని టైటిల్ సాంగ్‍ను.. ఈ ఎంసీఏ వార్షికోత్సవ ఈవెంట్‍లో పాడాడు సింగర్ శేఖర్ రవిజానీ. ఫుల్ జోష్‍తో సాంగ్ సాగింది. ఈ క్రమంలో శేఖర్‌తో కలిసి కాసేపు స్టెప్ వేశారు గవాస్కర్. ఫుల్ జోష్‍తో బాంగ్రా స్టైల్‍లో డ్యాన్స్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.
పాటపడిన సచిన్
ఆ తర్వాత పాట పాడుతూ సచిన్ టెండూల్కర్ దగ్గరికి వెళ్లాడు సింగర్ శేఖర్. మైక్‍ను సచిన్ ముందు పెట్టాడు. దీంతో ఓ శాంతి ఓం అంటూ కాస్త పాట పడారు సచిన్. పాటకు గొంతుకలిపారు. గవాస్కర్ కూడా ఓం శాంతి ఓం అంటూ పాడారు.
గవాస్కర్ డ్యాన్స్ చేసి, సచిన్ గొంతు కలిపిన ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. లెజెండరీ క్రికెటర్స్ జోష్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అద్భుతమంటూ కామెంట్లు చేస్తున్నారు.
వాంఖెడే స్టేడియం 50వ వార్షికోత్సవానికి ముంబైకి చెందిన పురుష, మహిళా క్రికెటర్లు చాలా మంది హాజరయ్యారు. తమ కెరీర్ మొదలుపెట్టి.. తమ ఎదుగుదలకు పునాదిగా నిలిచిన వాంఖేడే స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. గవాస్కర్, సచిన్, దిలీప్ వెంగ్‍సర్కార్, రవిశాస్త్రి, రోహిత్ శర్మ, అజింక్య రహానే, దయానా ఎజుల్జీ, వినోద్ కాంబ్లీ సహా మరికొందరు లెజెండ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబై దేశవాళీ క్రికెటర్లు కూడా హాజరయ్యారు.
మనసులు గెలిచిన రోహిత్
ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజ్‍పైకి దిగ్గజ క్రికెటర్లను నిర్వాహకులు ఆహ్వానించారు. గవాస్కర్, సచిన్, రవిశాస్త్రి, రోహిత్, రహానే సహా మరికొందరికి స్టేజ్‍పై సీటింగ్ ఏర్పాట్లు చేశారు. కుడివైపు, మధ్యలో, ఎడమ వైపు కొన్ని కుర్చీలను వేశారు. ఈ క్రమంలో ఎడమ వైపున రవిశాస్త్రి కూర్చున్నారు. ఆ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. రవిశాస్త్రిని మధ్యలో ఉండే సీట్‍కు వెళ్లాలని అడిగాడు. రవిశాస్త్రిని గౌరవిస్తూ సెంటర్ సీట్‍లో కూర్చోవాలని చెప్పాడు. దీంతో సీటు మారారు శాస్త్రి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పనితో మరోసారి మనసులను మరోసారి గెలిచావంటూ రోహిత్ శర్మను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సంబంధిత కథనం