దశాబ్దానికిపైగా భారత టెస్టు క్రికెట్ కు మూల స్తంభాలుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీమ్ ను వదిలేశారు. మే 7న రోహిత్, మే 12న కోహ్లి టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన ఈ పెయిర్.. వన్డేల్లో మాత్రం కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ ను దేశానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ ప్రపంచకప్ లో ఈ ఇద్దరు ఆడటంపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2027 వన్డే ప్రపంచకప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడటంపై సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ మెగా ఈవెంట్ లో రోహిత్, కోహ్లి ఆడతారని అనుకోవడం లేదని సన్నీ అన్నారు.
"లేదు, వాళ్లు (రోహిత్, కోహ్లి) ఆడతారని నేను అనుకోవడం లేదు. నేను చాలా నిజాయితీగా చెబుతున్నా. కానీ ఎవరికి తెలుసు, వచ్చే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంలో వాళ్లు మంచి ఫామ్ లో ఉంటే.. వందలు స్కోర్ చేస్తే దేవుడు కూడా వాళ్లను తొలగించలేడు’’ అని గవాస్కర్ వారిని తొలగించలేడు," అని గవాస్కర్ స్పోర్ట్స్ టుడేతో తెలిపారు.
"రోహిత్, కోహ్లి ఈ ఫార్మాట్ (వన్డే)లో గొప్ప ప్రదర్శన కనబరిచారు. సెలక్షన్ కమిటీ బహుశా 2027 వన్డే ప్రపంచ కప్ కోసం చూస్తుంది. ‘ఈ ఇద్దరూ 2027 ప్రపంచ కప్ కోసం జట్టులో ఉండగలరా? గతంలో లాగా జట్టుకు సహకారం అందించగలరా?’ అని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తుంది. సెలక్షన్ కమిటీ ఆలోచన విధానం అదే. ‘అవును, వాళ్లు (రోహిత్, కోహ్లి) ఆడగలరు’ అని కమిటీ భావిస్తే ఆ ఇద్దరూ టీమ్ లో ఉంటారు’’ అని సన్నీ పేర్కొన్నారు.
2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టులో రోహిత్ ఉన్నాడు. మరోవైపు కోహ్లి 2011 వన్డే ప్రపంచకప్ టీమ్ లో ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి గతేడాది 2024 టీ20 ప్రపంచకప్ ను ముద్దాడారు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్ ముంగిట రోహిత్, విరాట్ సుదీర్ఘ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. 2027 వన్డే ప్రపంచకప్ ను గెలవాలని ఉందని ఈ ఇద్దరూ గతంలో చాలా సార్లు చెప్పారు. అదే లక్ష్యంతో ఇప్పుడు టెస్టు రిటైర్మెంట్ ప్రకటించారు.
కోహ్లీ ఎక్కువగా ఇష్టపడే టెస్టు ఫార్మాట్‌లో 123 మ్యాచ్‌లలో 30 సెంచరీలతో 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాడు. అతను 67 టెస్టుల్లో 40.57 సగటుతో 12 సెంచరీలతో 4,301 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం