టీమిండియా బెంచ్ స్ట్రెంత్ బలంగా ఉందని పేర్కొన్న దిగ్గజం సునీల్ గవస్కర్.. బుమ్రా, రోహిత్, కోహ్లి లేకపోయినా జట్టు గెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడకపోయినా భారత్ టైటిల్ గెలవడాన్ని సన్నీ గుర్తు చేశాడు. అలాగే అంతకంటే ముందు కోహ్లి, రోహిత్ లేకపోయినా భారత్ మ్యాచ్ లు గెలిచిందని పేర్కొన్నాడు. మిడ్ డే పత్రికకు రాసిన కాలమ్ లో సన్నీ ఈ విషయాలు ప్రస్తావించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడం.. జట్టు లోతును, సాటిలేని బెంచ్ బలాన్ని తెలియజేస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా వరుసగా రెండో ఐసీసీ టైటిల్ ను గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ ను చిత్తు చేసింది. భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
గత ఏడాది టీ20 ప్రపంచకప్ మాదిరిగానే లీగ్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్లను ఓడించిన భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 25 ఏళ్ల క్రితం నైరోబీలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్ ఈ సారి కివీస్ రెక్కలను చీల్చి ప్రతీకారం తీర్చుకుంది.
ఆస్ట్రేలియా టూర్ ఓటమి తర్వాత భారత్ పరిస్థితులను మలుపు తిప్పిన తీరును గవాస్కర్ ప్రశంసించాడు. ఆసీస్ లో 1-3 తేడాతో ఘోర పరాజయాన్ని అధిగమించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
‘‘ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గొప్ప విజయం సాధించింది. నెల రోజుల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ని టెస్టు సిరీస్ ఓటమి నిరాశపర్చింది. సిరీస్ లో తొలి టెస్టులో విజయం సాధించిన జట్టు తర్వాతి నాలుగు టెస్టుల్లో మూడింటిలో ఓడిపోవడం ఆ జట్టు బలానికి సరైన సూచిక కాదు' అని మిడ్ డే పత్రికకు రాసిన కాలమ్ సన్నీ లో పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో బుమ్రా గాయంతో మైదానం వీడటం భారత అవకాశాలను దెబ్బకొట్టింది. ‘‘ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత భారత్ ఏమాత్రం సమయాన్ని వృథా చేసుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి తమకు తక్కువ సమయం ఉందని వారికి తెలుసు. ఇంగ్లాండ్ తో మూడు వన్డేలే మిగిలాయి. అందుకే కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ టీమ్ పై ఫోకస్ పెట్టారు. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను జట్టులోకి ఎంపిక చేశారు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
’’టీమిండియా తిరిగి భారత్ కు వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే, టీ20 సిరీస్ లలో ఘన విజయం సాధించి పుంజుకోవడం భారత క్రికెట్ లో ఉన్న ప్రతిభకు నిదర్శనం. ఆ విజయాలతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ చూస్తే బుమ్రా అనివార్యం కాదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఛాంపియన్స్ లా ఆడింది. తమకు అడ్డువచ్చిన ఏ జట్టునైనా చిత్తుగా ఓడించింది. బంగ్లాదేశ్ పై 3/31, పాకిస్థాన్ పై 1/30 వికెట్లు తీసిన రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఆడించడం మంచి ప్లాన్. లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆ స్పిన్నర్ 5/52తో రాణించడంతో నాకౌట్స్ కు ఆటోమేటిక్ గా ఎంపికయ్యాడు’’ అని గావస్కర్ ప్రస్తావించాడు.
గతంలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే భారత్ గెలిచిందని, అయితే జట్టులో వారి ఉనికి మరింత శక్తిని ఇస్తుందని గావస్కర్ అన్నాడు. దుబాయ్ లోనే కాదు భారత్ ఎక్కడ ఆడినా టోర్నీ గెలిచేదని చాలా మంది విదేశీ క్రికెటర్లు చెప్పడం మంచి పరిణామమని సన్నీ పేర్కొన్నాడు.
సంబంధిత కథనం