Team India: టీమిండియాలో అలాంటి ప్లేయర్లు వద్దు: బీసీసీఐకి మాజీ కెప్టెన్ సూచనలు
Sunil Gavaskar - Team India: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి పాలైంది. దీంతో విఫలమైన ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి. భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్.. బీసీసీఐకు కొన్ని సూచనలు చేశారు. ఆ వివరాలు ఇవే..
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. 1-3తో సిరీస్ కోల్పోయి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మ సేన తీవ్రంగా నిరాశపరిచింది. సిరీస్‍లో తొలి మ్యాచ్ గెలిచినా.. ఆ తర్వాత ఘోరంగా ఫెయిల్ అయింది. సిడ్నీ టెస్టులో మూడో రోజే ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ అర్హత రేసు నుంచి భారత్ తప్పుకుంది.
ఆసీస్‍తో టెస్టు సిరీస్‍లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. ఘోర వైఫల్యాన్ని చూశారు. స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మినహా ఇతర ప్లేయర్లు పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయారు. దీంతో టీమిండియాపై విమర్శలు చాలా వస్తున్నాయి. ముఖ్యంగా మాజీలు ఆగ్రహిస్తున్నారు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజం సునీల్ గవాస్కర్.. భారత జట్టుపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
సగం ఇక్కడ.. సగం ఎక్కడో లాంటి ప్లేయర్లు వద్దు
మైదానంలో మనసు సగం పెట్టి.. మరో సగాన్ని ఎక్కడో ఉంచే ఆటగాళ్లు భారత జట్టులో వద్దని గవాస్కర్ చెప్పారు. ఆటగాళ్లను గారాబం చేయవద్దని బీసీసీఐకి సూచించారు. “సగం ఇక్కడ ఉండి.. మరో సగం ఎక్కడో ఉండే లాంటి ప్లేయర్లు వద్దు. ఎవరినైనా సరే గారాబం చేయడాన్ని ఆపాల్సిన సమయం వచ్చింది. ఇటీవలి ఫలితాలు చాలా నిరుత్సాహంగా ఉన్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍లో మనం ఉండాల్సింది. కానీ అర్హత సాధించలేదు” అని సిడ్నీ టెస్టు తర్వాత గవాస్కర్ చెప్పారు.
స్టార్ కల్చర్ ముగియాలి
టీమిండియాలో స్టార్ కల్చర్ ఇక ముగియాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. “తదుపరి 8-10 రోజులు భారత క్రికెట్‍కు చాలా కీలకమైనవి. పరిశీలన చేసుకునేందుకు మంచి టైమ్. ముఖ్యంగా స్టార్ కల్చర్ ముగిసిపోవాలి. భారత క్రికెట్‍పై పూర్తి అంకితభావంతో ఉండాలి. ఇందులో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. నిజమైన మెడికల్ ఎమర్జెన్సీ తప్పిస్తే ప్లేయర్లు ప్రతీసారి జట్టుకు అందుబాటులో ఉండాల్సిందే. ఎవరైనా పూర్తి అంకితభావంతో లేకపోతే వారిని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోకూడదు” అని గవాస్కర్ చెప్పారు.
బీసీసీఐ అలా చేయడం అపేయాలి
కొందరి ఆరాధించేలా చేయడాన్ని బీసీసీఐ తక్షణమే ఆపేయాలని సునీల్ గవాస్కర్ సూచించారు. నిర్ణయాలు తీసుకునేందుకు అసలు వెనుకాడకూడదని చెప్పారు. “భారత క్రికెట్ ముందు అని వారు ప్లేయర్లకు గట్టిగా చెప్పాలి. పూర్తి ప్రాధాన్యతను భారత క్రికెట్‍కు ఇస్తారా.. వేరే వాటిపై దృష్టి పెడతారా అని స్పష్టంగా అడగాలి. రెండూ ఎవరూ చేయలేరు. భారత క్రికెట్ ప్రాధాన్యతగా ఉన్న వారిని మాత్రమే సెలెక్ట్ చేయాలి” అని గవాస్కర్ చెప్పారు.
ఆసీస్‍తో టెస్టు సిరీస్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతడు రిటైర్ అవ్వాలంటూ డిమాండ్లు భారీగా వినిపించాయి. చివరి టెస్టుకు స్వయంగా రోహిత్ శర్మనే పక్కన కూర్చున్నాడు. అయితే, తాను ఇప్పట్లో రిటైర్ అవననేలా హిట్‍మ్యాన్ చెప్పాడు. తనకు ఎప్పుడు ఏం చేయోలో తెలుసునని అన్నారు. మళ్లీ ఫామ్‍లోకి వస్తాననే నమ్మకం ఉందని చెప్పాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆసీస్‍తో సిరీస్‍లో విఫలమయ్యాడు. ఈ ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి మరో వారంలో భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. దీంతో పేలవమైన ఫామ్‍లో ఉన్న ఈ ఇద్దరికీ చోటు దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
సంబంధిత కథనం