Steve Smith: స్టీవ్ స్మిత్.. టెస్టుల్లో 35వ సెంచరీ, 10 వేల పరుగులు.. గవాస్కర్‌ను మించి, సచిన్ టెండూల్కర్‌ను సమం చేసి..
Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. టెస్టుల్లో 35వ సెంచరీతోపాటు 10 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో గవాస్కర్ ను వెనక్కి నెట్టి, సచిన్ టెండూల్కర్ ను సమం చేయడం విశేషం.
Steve Smith: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలి రోజే రికార్డుల పరంపర నెలకొల్పాడు. టెస్టుల్లో 35వ సెంచరీతోపాటు 10 వేల పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. టెస్టు క్రికెట్ లో ఇలా 10 వేల మార్క్ దాటిన 15వ బ్యాటర్ గా నిలిచాడు. ఇక సెంచరీల పరంగా గవాస్కర్ 34 సెంచరీల మార్క్ దాటి మరో అడుగు వేశాడు.

స్టీవ్ స్మిత్ రికార్డులు
శ్రీలంకతో గాలెలో బుధవారం (జనవరి 29) ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే ఆస్ట్రేలియా స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెలరేగిపోయాడు. అతడు సెంచరీ చేయడంతో తొలి రోజు ఆస్ట్రేలియా 2 వికెట్లకు 330 రన్స్ చేసింది. కమిన్స్ లేకపోవడంతో ఈ టెస్టులో స్మిత్ స్టాండిన్ కెప్టెన్ గా ఉన్నాడు.
ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు మూడో వికెట్ కు ఇప్పటికే అజేయంగా 195 రన్స్ జోడించడం విశేషం. ఈ క్రమంలో స్మిత్ టెస్టుల్లో 35వ సెంచరీ నమోదు చేశాడు. సునీల్ గవాస్కర్ 34 సెంచరీల మార్క్ ను అతడు దాటాడు. గవాస్కర్ తోపాటు యూనిస్ ఖాన్, మహేళ జయవర్దనే, బ్రియాన్ లారాలాంటి లెజెండ్స్ ను కూడా స్మిత్ అధిగమించాడు.
సచిన్ రికార్డు సమం
గవాస్కర్ ను అధిగమించడంతోపాటు సచిన్ టెండూల్కర్ కు చెందిన ఓ రికార్డును కూడా స్మిత్ సమం చేశాడు. స్మిత్ 205వ ఇన్నింగ్స్ లో 35వ సెంచరీ చేశాడు. రికీ పాంటింగ్ (194), సచిన్ (200) తర్వాత అత్యంత వేగంగా 35 సెంచరీల మార్క్ అందుకున్న బ్యాటర్ స్మిత్.
అయితే 205 ఇన్నింగ్స్ ముగిసే లోపు 35 సెంచరీలు చేసిన సచిన్ రికార్డును స్మిత్ సమం చేశాడు. ఇందులో పాంటింగ్ 36 సెంచరీలతో టాప్ లో కొనసాగుతున్నాడు. ఇదే ఇన్నింగ్స్ లో టెస్టుల్లో 10 వేల పరుగులతో మరో మైలురాయిని కూడా స్మిత్ అందుకోవడం విశేషం.
స్మిత్ కంటే ముందు ఉస్మాన్ ఖవాజా కూడా సెంచరీ చేశాడు. దీంతో తొలి రోజు పూర్తిగా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ టీమ్ 2 వికెట్లకు 330 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్ కూడా 57 రన్స్ చేశాడు.