ENG vs SA World Cup: గర్జించిన దక్షిణాఫ్రికా.. చేతులెత్తేసిన ఇంగ్లండ్-south africa won with big margin against england in icc odi world cup 2023 ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  South Africa Won With Big Margin Against England In Icc Odi World Cup 2023

ENG vs SA World Cup: గర్జించిన దక్షిణాఫ్రికా.. చేతులెత్తేసిన ఇంగ్లండ్

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 21, 2023 08:55 PM IST

ENG vs SA ODI World Cup 2023: ఇంగ్లండ్‍పై దక్షిణాఫ్రికా భారీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‍లో సత్తాచాటిన సఫారీలు ఇంగ్లిష్ జట్టును గడగడలాడించారు.

ENG vs SA World Cup: గర్జించిన దక్షిణాఫ్రికా.. చేతులెత్తేసిన ఇంగ్లండ్
ENG vs SA World Cup: గర్జించిన దక్షిణాఫ్రికా.. చేతులెత్తేసిన ఇంగ్లండ్ (REUTERS)

ENG vs SA ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో గత మ్యాచ్‍లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా దెబ్బతిన్న పులిలా గర్జించింది. అద్భుత ఆల్‍రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‍ను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్‍లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో నేడు (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‍లో దక్షిణాఫ్రికా 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‍పై భారీ విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

సఫారీ బౌలర్ల విజృంభణతో 400 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ కేవలం 22 ఓవర్లలో 170 పరుగులకే చాపచుట్టేసింది. గాయపడిన రీస్ టాప్లీ బ్యాటింగ్‍కు రాలేకపోయాడు. టేలెండర్లు మార్క్ వుడ్ (43 నాటౌట్), గుస్ అట్కిన్‍సన్ (35) మెరుపు హిట్టింగ్‍తో రాణించడంతో ఇంగ్లిష్ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీకి మూడు, మార్కో జాన్సెన్‍, లుంగీ ఎంగ్డీకి చెరో రెండు వికెట్లు దక్కాయి. కగిసో రబాడా, కేశవ్ మహారాజ్‍ చెరో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోరు చేసింది. సఫారీ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ (109) సెంచరీతో కదం తొక్కగా.. రెజా హెన్‍డ్రిక్స్ (85), మార్కో జాన్సెన్ (75 నాటౌట్), రాసీ వాండర్ డుసెన్ (60) అదరగొట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే మూడు, గస్ అట్కిన్‍సన్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. మొత్తంగా ఇంగ్లండ్‍పై దక్షిణాఫ్రికా భారీ విజయం నమోదు చేసింది. ఇక, ఈ మెగాటోర్నీలో నాలుగు మ్యాచ్‍ల్లో మూడింట ఓడిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఇంగ్లండ్ టపటపా..

భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ టపటపా వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్‍కు క్యూ కట్టారు. జానీ బెయిర్ స్టో (10), జో రూట్ (2), డేవిడ్ మలన్ (6), బెన్ స్టోక్స్ (5) ఎక్కువసేపు నిలువలేకపోయారు. భారీ షాట్లకు పోయి ఒక్కరూ కూడా సఫలం కాలేకపోయారు. హ్యారీ బ్రూక్ (17), జాస్ బట్లర్ (15), డేవిడ్ విల్లే (12), ఆదిల్ రషీద్ (10) కూడా విఫలమయ్యారు. దీంతో 84 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లిష్ జట్టు కనీసం 100 పరుగులైనా చేసేలా కనిపించలేదు. ఆ దశలో టెయిలెండర్లు మార్క్ వుడ్ (17 బంతుల్లో 43 పరుగులు; నాటౌట్), అట్కిన్‍సన్ (21 బంతుల్లో 35 పరుగులు) కాసేపు మెరుపులు మెరిపించారు. వుడ్ ఏకంగా 5 సిక్సర్లు బాదాడు. అయితే, 22వ ఓవర్ చివరి బంతికి అట్కిన్‍సన్ ఔటయ్యాడు. బౌలింగ్‍లో గాయపడిన టాప్లే బ్యాటింగ్‍కు రాలేకపోయాడు. దీంతో 170 పరుగులకే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియగా.. దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. వన్డేల్లో ఇంగ్లిష్ జట్టుపై సఫారీలకు ఇదే అతిపెద్ద విజయంగా ఉంది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా వీరబాదుడు బాదింది. హెన్రిచ్ క్లాసెన్ 67 బంతుల్లోనే 109 పరుగులతో మెరుపు సెంచరీ చేయగా.. మార్కో జాన్సెన్ 42 బంతుల్లోనే 75 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో చివరి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏకంగా 143 పరుగులు చేసింది. వీరికంటే ముందు రెజా హెన్‍డ్రిక్స్, రాసీ వాండెర్ డసెన్ కూడా అర్ధ శతకాలతో మెరిశారు. మొత్తంగా సఫారీ జట్టు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‍కు దక్షిణాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ బవుమా విశ్రాంతి తీసుకోగా.. ఐడెన్ మార్క్‌రమ్ సారథ్యం వహించాడు.

ఈ పరాజయంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగు మ్యాచ్‍ల్లో మూడు మ్యాచ్‍ల్లో ఓడింది బట్లర్ సేన. ఇక, దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచ్‍ల్లో మూడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది.

WhatsApp channel

సంబంధిత కథనం