Womens T20 World Cup 2024: సెమీస్‌లో 15 ఏళ్ల తర్వాత ఓడిన ఆస్ట్రేలియా, చెదిరిన కంగారూల ఏడో టైటిల్ కల-south africa women knock out six time champions australia women to reach icc womens t20 world cup 2024 final ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Womens T20 World Cup 2024: సెమీస్‌లో 15 ఏళ్ల తర్వాత ఓడిన ఆస్ట్రేలియా, చెదిరిన కంగారూల ఏడో టైటిల్ కల

Womens T20 World Cup 2024: సెమీస్‌లో 15 ఏళ్ల తర్వాత ఓడిన ఆస్ట్రేలియా, చెదిరిన కంగారూల ఏడో టైటిల్ కల

Galeti Rajendra HT Telugu

ICC Womens T20 World Cup 2024 Final: టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న ఆస్ట్రేలియా టీమ్ సెమీ ఫైనల్లో బోల్తాకొట్టింది. ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో తిరుగులేని రికార్డులున్న ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా అలవోకగా ఓడించి ఇంటిబాట పట్టించింది.

ఆస్ట్రేలియా ఇంటికి, దక్షిణాఫ్రికా ఫైనల్‌కి (REUTERS)

యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా ఉన్న ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ అనూహ్యరీతిలో సెమీస్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది.

దుబాయ్ వేదికగా గురువారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ఆరు సార్లు టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో సెమీస్‌లో ఓడిపోయింది.

ఫస్ట్ సెమీ ఫైనల్ జరిగిందిలా

తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని మరో 16 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా టీమ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 135/2తో ఛేదించేసింది.

ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ మూనీ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మరోవైపు లక్షఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటర్ బోస్క్ 48 బంతుల్లో అజేయంగా 74 పరుగులు చేసి ఒంటిచేత్తో దక్షిణాఫ్రికా టీమ్‌ను ఫైనల్‌కి చేర్చింది.

టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా రికార్డ్స్

మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికే ఏడు సార్లు ఆస్ట్రేలియా టీమ్ ఫైనల్లో ఆడింది. ఈ ఏడింటిలో ఒక్కసారి మాత్రమే ఓడిపోయిన ఆస్ట్రేలియా టీమ్.. ఆరుసార్లు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అలానే 2009లో చివరి సారిగా టీ20 ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓడిన ఆస్ట్రేలియా.. ఈ 15 ఏళ్లలో ప్రతిసారి కనీసం ఫైనల్ చేరుతూ వచ్చింది.

టోర్నీలో ఎట్టకేలకి 15 ఏళ్ల తర్వాత కంగారూలను సెమీస్‌లోనే దక్షిణాఫ్రికా ఇంటిబాట పట్టించింది. ఇక ఆస్ట్రేలియా టీమ్ ఫైనల్లో ఎప్పుడు ఓడిందంటే.. 9 ఏళ్ల క్రితం 2015 వెస్టిండీస్ టీమ్ ఫైనల్లో కంగారూలను ఓడించింది. ఏడోసారి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ గెలవాలనే ఆస్ట్రేలియా టీమ్ కల చెదిరిపోయింది.

లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచినా

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2024 టోర్నీ లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా.. నాల్గింటిలోనూ విజయం సాధించింది. ఆ జట్టు వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్, భారత్ మహిళల జట్లని ఓడించేసి సెమీస్‌కి అర్హత సాధించింది. దాంతో భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు కనీసం సెమీస్ చేరుకుండానే ఇంటిబాట పట్టాయి.

న్యూజిలాండ్ టీమ్ ఈరోజు వెస్టిండీస్‌తో సెమీ ఫైనల్-2 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కి వెళ్లనుంది. టోర్నీ తుది పోరు ఆదివారం జరగనుంది. ఆస్ట్రేలియా రూపంలో పెద్ద అడ్డంకి తొలగిపోవడంతో న్యూజిలాండ్, వెస్టిండీస్ టీమ్‌కి ఫైనల్ ముంగిట గొప్ప ఉపశమనం లభించినట్లయ్యింది.