మరో షాక్.. 33 ఏళ్లకే స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు ఇష్టమైన ఆటగాడు-south africa star cricketer heinrich klaasen retires from international cricket at 33 ipl 2025 sunrisers hyderabad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  మరో షాక్.. 33 ఏళ్లకే స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు ఇష్టమైన ఆటగాడు

మరో షాక్.. 33 ఏళ్లకే స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు ఇష్టమైన ఆటగాడు

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ వన్డే రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటలకే మరో స్టార్ ప్లేయర్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున అతని మెరుపులు తెలిసిందే.

హెన్రిచ్ క్లాసెన్ (Reuters)

దక్షిణాఫ్రికా పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏజ్ లోనే అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ను వదిలేయడం నిజంగా షాకింగే. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే క్లాసెన్ తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు ఇష్టమైన ఆటగాళ్లలో ఒకడు. సోమవారం (జూన్ 2) గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత క్లాసెన్ ఈ ప్రకటన చేశాడు.

ఏడేళ్ల కెరీర్

ప్రోటీస్ తరఫున ఏడు సంవత్సరాల విజయవంతమైన కెరీర్‌కు క్లాసెన్ ముగింపు పలికాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ 2018లో వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన తరం అత్యంత విధ్వంసకరమైన వైట్ బాల్ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. క్లాసెన్ నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. గత సంవత్సరం టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు క్లాసెన్. టెస్టుల్లో 104, వన్డేల్లో 2141, టీ20ల్లో 1000 పరుగులు చేశాడు.

చాలా బాధగా ఉంది

"నేను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అవుతున్నానని ప్రకటించడం చాలా బాధగా ఉంది. నాకు, నా కుటుంబానికి భవిష్యత్తులో ఏది ఉత్తమమో నిర్ణయించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇది నిజంగా చాలా కష్టమైన నిర్ణయం. కానీ నేను దీనితో పూర్తి సంతృప్తిగా ఉన్నా" అని క్లాసెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాశాడు. "మొదటి రోజు నుంచి నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు అతిపెద్ద గౌరవం. ఇది నేను చిన్నప్పటి నుండి కష్టపడి పనిచేసి, కలలు కన్నది" అని క్లాసెన్ తెలిపాడు.

గొప్ప వ్యక్తులు

"నేను జీవితకాలం గుర్తుంచుకునే అద్భుతమైన స్నేహాలు, సంబంధాలను ఏర్పరచుకున్నా. ప్రోటీస్ తరఫున ఆడటం వల్ల నా జీవితాన్ని మార్చిన గొప్ప వ్యక్తులను కలవడానికి నాకు అవకాశం లభించింది. వారికి నేను ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ప్రోటీస్ జెర్సీ ధరించడానికి నా మార్గం చాలా మంది కంటే భిన్నంగా ఉంది. నన్ను నమ్మిన కొంతమంది కోచ్‌లకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా" అని క్లాసెన్ పోస్టు చేశాడు.

‘‘నా ఛాతీపై ప్రోటీస్ బ్యాడ్జ్‌తో ఆడటం నాకు అతిపెద్ద గౌరవం. ఈ నిర్ణయం వల్ల నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి నేను ఎదురు చూస్తున్నా. నేను ఎల్లప్పుడూ ప్రోటీస్‌కు పెద్ద అభిమానిగా ఉంటా. నా కెరీర్‌లో నాకు మద్దుతగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని క్లాసెన్ ముగించాడు.

పవర్ హిట్టర్

క్లాసెన్ అంటేనే పవర్ హిట్టర్. అలవోకగా సిక్సర్లు బాదేస్తుంటాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ నూ ఊచకోత కోస్తాడు. క్లాసెన్ వన్డేల్లో మిడిల్ ఆర్డర్‌లో సగటున 44 కంటే కొంచెం తక్కువతో 2141 పరుగులు చేశారు. 2023లో ఆస్ట్రేలియాతో తన హోం గ్రౌండ్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో అత్యుత్తమమైన 174 పరుగులతో ఆయన పవర్ హిట్టింగ్ సామర్థ్యం బయటపడింది. అయిదో నంబర్ బ్యాట్స్‌మన్ చేసిన రెండవ అత్యధిక స్కోర్ ఇది.

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన క్లాసెన్.. ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్ ల్లో కొనసాగనున్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున క్లాసెన్ అదిరే బ్యాటింగ్ తెలిసిందే. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ లాస్ట్ మ్యాచ్ లో క్లాసెన్ సెంచరీ చేయడం విశేషం.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం