2025 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా జట్టు గ్రాండ్ బోణీ చేసింది. శుక్రవారం ఆ జట్టు 107 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ పై విజయం సాధించింది. రికిల్టన్ (103) సెంచరీతో మొదట సఫారీ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగులు చేసింది. ఛేజింగ్ లో తడబడ్డ అఫ్గాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (90) పోరాడాడు. సఫారీ బౌలర్లలో రబాడ 3.. ఎంగిడి, ముల్దర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ తేలిపోయింది. ఆ జట్టు త్వరగానే కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గుర్బాజ్ (10), జద్రాన్ (17) నిలబడలేకపోయారు. సెదికుల్లా అటల్ (16), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (0) కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో అఫ్గాన్ కష్టాల్లో పడింది. 50/4తో ఆ జట్టు ఓటమి ముందే ఖాయమైంది.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో రహ్మత్ షా పోరాటం కొనసాగించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. కానీ మరో ఎండ్ లో వికెట్లు పడటంతో అఫ్గాన్ కోలుకోలేకపోయింది. అజ్మతుల్లా ఒమర్ జాయ్ (18), మహమ్మద్ నబి (8), గుల్బాదిన్ నైబ్ (13), రషీద్ ఖాన్ (18) పెవిలియన్ కు వరుస కట్టారు. రహ్మత్ షా పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో రికిల్టన్ బ్యాటింగ్ హైలైట్. వన్డేల్లో తొలి సెంచరీతో రికిల్టన్ (103) చెలరేగాడు. ఈ ఓపెనర్ అద్భుత బ్యాటింగ్ తో అలరించాడు. మంచి టైమింగ్ తో షాట్లు కొట్టాడు. కెప్టెన్ బవుమా (58), వాండర్ డసెన్ (52), మార్ క్రమ్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరవడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 దాటింది. అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబి రెండు వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం