సౌతాఫ్రికా సంచలనం.. హిస్టరీ క్రియేట్ చేసిన సఫారీ టీమ్.. డబ్ల్యూటీసీ టైటిల్ కైవసం.. ఆసీస్ చిత్తు.. ఇండియన్ ఫ్యాన్స్ ఖుష్!-south africa beats australia crown as new world test champion wtc final 2025 sa vs aus markram icc title after 27 years ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  సౌతాఫ్రికా సంచలనం.. హిస్టరీ క్రియేట్ చేసిన సఫారీ టీమ్.. డబ్ల్యూటీసీ టైటిల్ కైవసం.. ఆసీస్ చిత్తు.. ఇండియన్ ఫ్యాన్స్ ఖుష్!

సౌతాఫ్రికా సంచలనం.. హిస్టరీ క్రియేట్ చేసిన సఫారీ టీమ్.. డబ్ల్యూటీసీ టైటిల్ కైవసం.. ఆసీస్ చిత్తు.. ఇండియన్ ఫ్యాన్స్ ఖుష్!

ఐసీసీ టోర్నీలు అనగానే దక్షిణాఫ్రికాను దుర‌దృష్టం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అసాధారణ ఫైటింగ్ తో బ్యాడ్ లక్ ను వెనక్కి నెట్టింది ఆ టీమ్. మార్‌క్ర‌మ్‌ అద్భుతమైన శతకంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలిచింది. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ ను ఓడించింది సౌతాఫ్రికా.

సెంచరీతో దక్షిణాఫ్రికాను గెలిపించిన మార్‌క్ర‌మ్‌ (AP)

సౌతాఫ్రికా సాధించింది. బ్యాడ్ లక్ ను గెలిచింది. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన దక్షిణాఫ్రికా.. 27 ఏళ్ల వెయిటింగ్ కు ఎండ్ కార్డు వేసింది. రెండో ఐసీసీ టైటిల్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 గదను దక్కించుకుంది. మార్‌క్ర‌మ్‌ (136; 207 బంతుల్లో 14 ఫోర్లు) సెన్సేషనల్ సెంచరీతో లార్డ్స్ లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలిచింది.

ఫ్యాన్స్ హ్యాపీ

శనివారం ముగిసిన మ్యాచ్ లో సఫారీ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా విజయంతో భారత అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎందుకంటే 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను ఓడించే ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అందుకే ఇప్పుడు ఆసీస్ ఓటమిని మన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మార్‌క్ర‌మ్‌ అద్భుతం

282 పరుగుల టార్గెట్.. అసలే సీమ్, స్వింగ్ కు అనుకూలిస్తూ, పేసర్లకు సహకరిస్తున్న పిచ్.. అవతల కమిన్స్, హేజిల్ వుడ్, స్టార్క్ లాంటి డేంజరస్ పేసర్లు.. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా గెలుస్తుందన్న అంచనాలు పెద్దగా లేవు. ఆసీస్ మరోసారి డబ్ల్యూటీసీ టైటిల్ నిలబెట్టుకుంటుందనే అనిపించింది. కానీ మార్‌క్ర‌మ్‌ అద్భుతం చేశాడు. అసాధారణ సెంచరీతో టీమ్ ను గెలిపించాడు.

కెప్టెన్ తో కలిసి

దక్షిణాఫ్రికా ఛేజింగ్ లో రికిల్టన్ మూడో ఓవర్లోనే ఔటైపోయాడు. ముల్దర్ (27) ఇన్నింగ్స్ కు స్టార్క్ తెరదించాడు. ఆ దశలో మార్‌క్ర‌మ్‌, కెప్టెన్ బవుమా (66; 134 బంతుల్లో 5 ఫోర్లు) గొప్పగా పోరాడారు. ఆసీస్ బౌలర్లను అద్భుతంగా అడ్డుకున్నారు. ఎంతో ఓపికతో, మరెంతో సంయమనంతో బ్యాటింగ్ కొనసాగించారు. ఒక్కో పరుగు చేస్తూ.. ఒక్కో బౌండరీ సాధిస్తూ ఇటుకపై ఇటుక పేర్చినట్లు ఇన్నింగ్స్ నిర్మించారు.

మార్‌క్ర‌మ్‌ సెంచరీ కంప్లీట్ చేసుకోగా.. బవుమా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీళ్లిద్దరూ క్రీజులో ఉండగా మూడో రోజును సఫారీ జట్టు 213/2తో ముగించింది.

69 పరుగులే

హిస్టరీ క్రియేట్ చేసేందుకు 69 పరుగులే అవసరమైన దశలో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించింది దక్షిణాఫ్రికా. బవుమాను కమిన్స్ త్వరగానే ఔట్ చేశాడు. కానీ స్టబ్స్ (8), బెడింగ్ హమ్ (21 నాటౌట్) తో కలిసి మార్‌క్ర‌మ్‌ పోరాటం కొనసాగించాడు. విక్టరీకి దక్షిణాఫ్రికా చేరువైన తర్వాత మార్‌క్ర‌మ్‌ ఔటయ్యాడు. బెడింగ్ హమ్, వెరీన్ కలిసి మ్యాచ్ ముగించారు.

ఆసీస్ దే ఆధిపత్యం

డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లు ముగిసే సరికి కంగారూ జట్టుదే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 74 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 212 పరుగులకే ఆలౌటైంది. బ్యూ వెబ్ స్టర్ (72), స్టీవ్ స్మిత్ (66) ఆసీస్ ను ఆదుకున్నారు. సఫారీ బౌలర్లలో రబాడ 5 వికెట్లతో చెలరేగాడు. యాన్సెన్ 3 వికెట్లు తీసుకున్నాడు.

సఫారీ ఢమాల్

తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 138 పరుగులకే కుప్పకూలింది. బెడింగ్ హమ్ (45), కెప్టెన్ బవుమా (36) మాత్రమే కాస్త రాణించారు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 6 వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. స్టార్క్ 2 వికెట్లు తీశాడు. హేజిల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆసీస్ కు 74 పరుగుల ఆధిక్యాన్ని కోల్పోయింది.

కంగారూను పడగొట్టి

రెండో ఇన్నింగ్స్ లో కంగారూ జట్టును దక్షిణాఫ్రికా పడగొట్టింది. రబాడ 4, ఎంగిడి 3 వికెట్లతో సత్తాచాటడంతో ఆసీస్ 207 పరుగులకే ఆలౌటైంది. ఆ టీమ్ లో స్టార్క్ (58 నాటౌట్), అలెక్స్ కేరీ (43) పోరాడారు. దీంతో దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల టార్గెట్ నిలిచింది. లార్డ్స్ లో ఆసీస్ పేస్ ను తట్టుకుని దక్షిణాఫ్రికా గెలవడం కష్టమే అనిపించింది. కానీ మార్‌క్ర‌మ్‌ అసాధారణ బ్యాటింగ్ తో టీమ్ గెలిచింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం