SA vs NZ: డికాక్, డుసెన్ సెంచరీల ధమాకా.. న్యూజిలాండ్‍కు భారీ టార్గెట్
SA vs NZ World Cup 2023: ప్రపంచకప్‍లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‍లో మరోసారి దుమ్మురేపింది. న్యూజిలాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు భారీ స్కోరు చేసింది.
SA vs NZ World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో బ్యాటింగ్‍లో దక్షిణాఫ్రికా మరోసారి ధనాధన్ చేసింది. న్యూజిలాండ్‍తో జరుగుతున్న మ్యాచ్‍లో సఫారీ టీమ్ భారీ స్కోరు చేసింది. ప్రపంచకప్‍లో భాగంగా పుణె వేదికగా నేడు (నవంబర్ 1) దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 357 పరుగుల భారీ స్కోరు చేసింది.
దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (116 బంతుల్లో 114 పరుగులు) మరో సెంచరీతో అదరగొట్టగా.. రాసీ వాండర్ డుసెన్ (118 బంతుల్లో 133 పరుగులు) కూడా శతక్కొట్టాడు. డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో 53 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ ప్రపంచకప్‍లో సఫారీ స్టార్ క్వింటన్ డికాక్ ఇది నాలుగో సెంచరీగా ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీకి రెండు, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్‍కు చెరో వికెట్ దక్కింది. న్యూజిలాండ్ ముందు 358 పరుగులు టార్గెట్ ఉంది.
ఈ ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‍ల్లో ఐదుసార్లు 300 కంటే ఎక్కువ స్కోరు చేసింది దక్షిణాఫ్రికా. శ్రీలంకపై 428 పరుగులు, ఆస్ట్రేలియాపై 311, ఇంగ్లండ్‍పై 399, బంగ్లాదేశ్‍పై 357 పరుగులు చేసింది. నేడు న్యూజిలాండ్‍పై 357 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆటాడుకున్న డికాక్, డుసెన్
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ ఇచ్చింది. దీంతో సఫారీ జట్టు మరోసారి సత్తాచాటింది. కెప్టెన్ తెంబా బవూమా (24) త్వరగానే ఔటైనా.. సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి అదరగొట్టాడు. ఈ ప్రపంచకప్‍లో నాలుగో శతకం చేసి సూపర్ ఫామ్ కొనసాగించాడు. మరోవైపు రాసీ వాండర్ డుసెన్ కూడా దుమ్మురేపాడు. డికాక్, డుసెన్ ఇద్దరూ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపారు. బౌండరీలతో చెమటలు పట్టించారు. దీంతో 36 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా స్కోరు 200 పరుగులు దాటింది. 101 బంతుల్లో సెంచరీకి చేరుకున్న డుసెన్ ఆ తర్వాత మరింత హిట్టింగ్ చేశాడు. డికాక్, డుసెన్ ఔటయ్యాక డేవిడ్ మిల్లర్ తన మార్క్ హిట్టింగ్ చేశాడు.
కిల్లర్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు 2 ఫోర్లతో 30 బంతుల్లోనే 53 రన్స్ చేశాడు. చివరి ఓవర్లో ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసేందుకు తోడ్పడ్డాడు. హెన్రిచ్ క్లాసెన్ (7 బంతుల్లో 15 పరుగులు; నాటౌట్) దూకుడుగా ఆడాడు. చివరి బంతికి క్రీజులోకి వచ్చిన ఐడెన్ మార్క్రమ్ సిక్సర్ బాది బ్యాటింగ్‍ను ఘనంగా ముగించాడు. 50 ఓవర్లలో 357 పరుగుల భారీ స్కోరు చేసింది దక్షిణాఫ్రికా.