Sourav Ganguly on Virat Kohli: విరాట్ కోహ్లి గ్రేటెస్ట్ వైట్ బాల్ ప్లేయర్.. ఇండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ: గంగూలీ
Sourav Ganguly on Virat Kohli: విరాట్ కోహ్లి గ్రేటెస్ట్ వైట్ బాల్ ప్లేయర్ అని అన్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియానే హాట్ ఫేవరెట్ అని కూడా అన్నాడు.
Sourav Ganguly on Virat Kohli: విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అయితే ఆస్ట్రేలియాలో తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత అతడు ఫామ్ కోల్పోవడం మాత్రం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు. రెవ్‌స్పోర్ట్స్ వీడియోతో మాట్లాడిన దాదా.. ఛాంపియన్స్ ట్రోఫీపైనా స్పందించాడు. ఇండియా హాట్ ఫేవరెట్ అని కూడా స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లి బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్
విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫామ్ కోల్పోయి విమర్శల పాలవుతున్నా.. గంగూలీ మాత్రం అతన్ని ఆకాశానికెత్తాడు. "ఝులన్, మిథాలీలాగే విరాట్ కోహ్లి కూడా అత్యంత అరుదైన క్రికెటర్. అంతర్జాతీయ క్రికెట్ లో 80 సెంచరీలు చేయడం అసాధారణం. నా వరకు అతడు గ్రేటెస్ట్ వైట్ బాల్ క్రికెటర్. కానీ ఆస్ట్రేలియాలో పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన తర్వాత ఫామ్ కోల్పోవడం ఆశ్చర్యం కలిగించింది.
అంతకుముందు ఇండియాలోనూ తడబడ్డాడు. పెర్త్ లో సెంచరీ తర్వాత గాడిలో పడినట్లు అనిపించినా.. అలా జరగలేదు. కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రతి ప్లేయర్ కు తనదైన బలాలు, బలహీనతలు ఉంటాయి. కానీ ఆ బలహీనతలను ఎలా అధిగమిస్తారన్నదే ముఖ్యం. విరాట్ కోహ్లిలో ఇప్పటికీ చాలా క్రికెట్ మిగిలే ఉంది" అని గంగూలీ స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్ టూర్ ఇంకా కష్టం
ఇక ఈ ఏడాది ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ కు టీమిండియా వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ ఆస్ట్రేలియా కంటే ఎక్కువ సవాళ్లు ఉంటాయని కూడా కోహ్లిని గంగూలీ హెచ్చరించాడు. "ఇంగ్లండ్ టూర్ అతనికి పెద్ద సవాలే. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ఫామ్ పై నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే అతడు ప్రపంచంలోనే బెస్ట్ వైట్ బాల్ ప్లేయర్. ఈ కండిషన్స్ లో ఈ టోర్నీలో అతడు పరుగులు చేస్తాడు.
కానీ రెడ్ బాల్ క్రికెట్ లో స్వింగింగ్, సీమింగ్ పిచ్ లపై ఆస్ట్రేలియా కంటే కూడా మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. విదేశాల్లో తొలి ఇన్నింగ్స్ లో 350 నుంచి 400 రన్స్ చేస్తే గెలిచే పరిస్థితుల్లో ఉంటారని నేను చెబుతూనే ఉన్నాను. 200లోపు ఆలౌటైతే ఇక ఎప్పుడూ గట్టెక్కడానికే ఆడాల్సి వస్తుంది. పెర్త్ లో గెలిచారంటే దానికి కారణం 400 నుంచి 500 రన్స్ చేయడమే" అని గంగూలీ అన్నాడు.
ఇండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ
ఇక వచ్చే నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీపైనా గంగూలీ స్పందించాడు. ఈ మెగా టోర్నీలో ఇండియన్ టీమ్ ఫేవరెట్ అని అన్నాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ ఫేవరెట్లలో ఇండియా ఒకటి. 50 ఓవర్ల వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ లలో వాళ్ల ప్రదర్శన అలా ఉంది.
టెస్టు క్రికెట్ పైనే వాళ్లు దృష్టి సారించాల్సి ఉంది. ముఖ్యంగా విదేశాల్లో ఆడే సమయంలో మరింత జాగ్రత్త అవసరం" అని గంగూలీ అన్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి స్పందిస్తూ.. అతడు వైట్ బాట్ క్రికెట్ లో అద్భుతంగా ఆడతాడని, ఛాంపియన్స్ ట్రోఫీలో పూర్తి భిన్నమైన రోహిత్ ను చూస్తారని చెప్పాడు.