శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున తొలి మ్యాచ్‌లో అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో తన సత్తా చాటుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (జిటి)పై పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంలో శ్రేయల్ 42 బంతుల్లో 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో కీలక పాత్ర పోషించాడు. 5 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగిన శ్రేయస్ తన జట్టును 243/6 స్కోరుకు చేర్చాడు. ఆ తర్వాత పీబీకేఎస్.. జిటిని 232/5కు కట్టడి చేసి విజయాన్ని సాధించింది. శ్రేయస్ ఇన్నింగ్స్ పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు.
గత ఏడాది కాలంలో బ్యాటర్ గా శ్రేయస్ అయ్యర్ ఎంతో బెటర్ అయ్యాడని గంగూలీ అన్నాడు. మూడు ఫార్మాట్లకు రెడీగా ఉన్నాడని పేర్కొన్నాడు. శ్రేయస్ ను టెస్టు, టీ20ల్లోనూ ఆడించేలా గంభీర్ చొరవ చూపాలనే అర్థం వచ్చేలా బీసీసీఐని గంగూలీ ట్యాగ్ చేశాడు.
‘శ్రేయస్ అయ్యర్ గత ఒక సంవత్సరంలో అత్యంత మెరుగైన బ్యాట్స్‌మన్ గా మారాడు. అన్ని ఫార్మాట్లకు రెడీగా ఉన్నాడు.లెంగ్త్ విషయంలో కొన్ని సమస్యల తర్వాత అతని ఇంప్రూవ్ మెంట్ చూడటం గొప్పగా ఉంది” అని గంగూలీ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
టీమిండియా వన్డే సెటప్ లో కీలక ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నాడు. కానీ టెస్టులు, టీ20ల్లోకి వచ్చే సరికి మాత్రం అతణ్ని పట్టించుకోవడం లేదు. గత ఏడాది తన కెరీర్ లో శ్రేయస్ ఒడుదొడుకులు చూశాడు. టెస్టులో చోటు కోల్పోయాడు. బీసీసీఐ చెప్పినా దేశవాళీ క్రికెట్లో ఆడలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వేటు తప్పలేదు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను విజేతగా నిలిపినా శ్రేయస్ కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు.
కిందపడ్డ ప్రతిసారి బలంగా పైకి లేచి శ్రేయస్ మరోసారి అలాగే పుంజుకున్నాడు. 2023/24 సీజన్‌లో ముంబయిని రంజీ టైటిల్ దిశగా నడిపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో కోహ్లి గాయం కారణంగా వచ్చిన ఛాన్స్ ను శ్రేయస్ వదల్లేదు.
అదే ఊపులో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఐపీఎల్ కొత్త ప్రయాణం స్టార్ట్ చేశాడు. తొలి మ్యాచ్ లోనే అజేయంగా 97 పరుగులతో సత్తాచాటాడు. కెప్టెన్సీలోనూ తనదైన ముద్ర వేశాడు. పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ లో ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది.
సంబంధిత కథనం