Shami on Pakistan Players: నా బౌలింగ్ చూసి పాకిస్థాన్ వాళ్లు ఏడుస్తున్నారు.. ఇప్పటికైనా మారండి: షమి సూపర్ పంచ్
Shami on Pakistan Players: కొందరు పాకిస్థాన్ ప్లేయర్స్ వరల్డ్ కప్ లో తన బౌలింగ్ చూసి తట్టుకోలేకపోయారని, ఇప్పటికైనా మారండి అంటూ టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి అన్నాడు
Shami on Pakistan Players: వరల్డ్ కప్ 2023లో మహ్మద్ షమి అద్భుతమైన బౌలింగ్ ప్రద్శనతో టీమిండియా ఫైనల్ వరకూ వచ్చింది. అయితే తన కళ్లు చెదిరే బౌలింగ్ ప్రదర్శనను కొందరు పాకిస్థానీ ప్లేయర్స్ జీర్ణించుకోలేకపోయారని షమి అనడం గమనార్హం. వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే ఇండియన్ బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారంటూ పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజాలాంటి వాళ్లు పిచ్చి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
అప్పుడే వాళ్లకు సోషల్ మీడియా ద్వారా గట్టి పంచ్ ఇచ్చిన షమి.. తాజాగా మరోసారి ఈ అంశంపై స్పందించాడు. పాకిస్థాన్ బౌలర్లు తామే బెస్ట్ అనుకుంటారని, అలా అయితే అవసరమైన టైమ్ లో ఆ పని చేసి చూపించాలని షమి అనడం విశేషం. ఈ వరల్డ్ కప్ లో షమి 24 వికెట్లు తీసి.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
పాక్ ప్లేయర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు: షమి
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత పాక్ ప్లేయర్స్ తెరపైకి తెచ్చిన కుట్ర సిద్ధాంతంపై షమి స్పందించాడు. ప్యూమా కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్లేయర్స్ కు కాస్త ఘాటుగానే అతడు సమాధానం ఇచ్చాడు. "నేనెవరినీ నిందించడం లేదు. నాలాగా మరో పది మంది బాగా పర్ఫామ్ చేస్తే మంచిదే. నేనెప్పుడూ ఎవరినీ చూసి అసూయ చెందలేదు. ఇతరుల సక్సెస్ ఎంజాయ్ చేస్తే మీరు కూడా ఓ మంచి ప్లేయర్ అవుతారు. మొదట్లో నేను ఆడలేదు.
తర్వాత రాగానే 5 వికెట్లు తీశాను. తర్వాత 4, తర్వాత మళ్లీ 5 వికెట్లు తీశారు. కొందరు పాకిస్థాన్ ప్లేయర్స్ కు ఇది జీర్ణించుకోవడం కష్టమైంది. ఎందుకంటే తామే బెస్ట్ అన్న ఫీలింగ్ వాళ్లలో ఉంది. కానీ నా వరకూ అవసరమైన సమయంలో పర్ఫామ్ చేసేవాడే బెస్ట్. అది వదిలేసి మీకు వేరే బాల్ ఇస్తున్నారు. వేరే కలర్ బాల్ ఇస్తున్నారు. వేరే కంపెనీది ఇస్తున్నారని అనడం ఏంటి? ఇప్పటికైనా మారండి" అని షమి ఆ ఇంటర్వ్యూలో అన్నాడు.
నిజానికి ఇదే విషయాన్ని మరో పాకిస్థాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ అప్పుడే స్పష్టం చేశాడు. హసన్ రజా తీరుపై అతడు మండిపడ్డాడు. మీతోపాటు మా పరువు ఎందుకు తీస్తున్నారంటూ ప్రశ్నించాడు. ఐసీసీ టోర్నీల్లో బాల్స్ ఎలా ఇస్తారో కూడా వివరంగా చెప్పాడు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో షమి కూడా చెబుతూ.. హసన్ రజాపై మరింత మండిపడ్డాడు.