WPL 2025: చెలరేగిన మంధాన.. ఆర్సీబీకి వరుసగా రెండో విక్టరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చిత్తు
WPL 2025: డబ్ల్యూపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్తోంది. కెప్టెన్ మంధాన రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుచేసిన ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

డబ్ల్యూపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం (ఫిబ్రవరి 17) ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. మొదట ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో స్మృతి మంధాన చెలరేగడంతో ఆర్సీబీ 2 వికెట్లే కోల్పోయి 16.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
మంధాన ధనాధన్
కెప్టెన్ స్మృతి మంధాన (81) చెలరేగడంతో ఓ మోస్తారు లక్ష్యం ఆర్సీబీకి మరీ చిన్నదైపోయింది. మరో ఓపెనర్ డ్యాని వ్యాట్ (42) తో కలిసి మంధాన ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. 47 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించింది. ఈ జోడీ తొలి వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. సెంచరీ చేసేలా కనిపించిన మంధాన ఔటైపోయినా.. ఎలీస్ పెర్రీ (7 నాటౌట్), రిచా ఘోష్ (11 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
కష్టపడి 141
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కష్టపడి 141 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు రేణుక సింగ్ (3/23), జార్జియా వారెహం (3/25), కిమ్ గార్థ్ (2/19), ఏక్తా బిష్ఠ్ (2/35) కలిసి ఢిల్లీని కట్టడి చేశారు. తొలి ఓవర్లోనే షెఫాలి (0) ఔటైనా.. మెగ్ లానింగ్ (17) తో కలిసి జెమీమా (34) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసింది.
60/1తో ఢిల్లీ పుంజుకునేలా కనిపించింది. కానీ ఆర్సీబీ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. మంచి లెంగ్త్ ల్లో బంతులేసి బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. దీంతో ఢిల్లీ 19.3 ఓవర్లలో ఆలౌటైంది. డబ్ల్యూపీఎల్ 2025లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి.
సంబంధిత కథనం