Sidhu on Rohit: రోహిత్ ఏం పాపం చేశాడు.. ధోనీలాగా చేస్తేనే హార్దిక్‌ను క్షమిస్తారు: సిద్దూ కామెంట్స్-sidhu on rohit sharma asks what wrong has he done hardik pandya should focus on team combination mubai indians ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sidhu On Rohit: రోహిత్ ఏం పాపం చేశాడు.. ధోనీలాగా చేస్తేనే హార్దిక్‌ను క్షమిస్తారు: సిద్దూ కామెంట్స్

Sidhu on Rohit: రోహిత్ ఏం పాపం చేశాడు.. ధోనీలాగా చేస్తేనే హార్దిక్‌ను క్షమిస్తారు: సిద్దూ కామెంట్స్

Hari Prasad S HT Telugu

Sidhu on Rohit: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడేం పాపం చేశాడని ప్రశ్నించాడు.

రోహిత్ ఏం పాపం చేశాడని ప్రశ్నించిన సిద్దూ

Sidhu on Rohit: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించినప్పటి నుంచీ ఆ టీమ్ కష్టాలు రెట్టింపయ్యాయి. తాజా ఐపీఎల్ సీజన్లో ఒక్క మ్యాచూ గెలవకపోగా.. ఎక్కడికెళ్లినా ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ సిద్దూ కూడా రోహిత్ ఏం పాపం చేశాడంటూ ప్రశ్నించాడు. అభిమానుల మనసులు గెలుచుకోవాలంటే హార్దిక్ పాండ్యా ఏం చేయాలో కూడా చెప్పాడు.

రోహిత్ ఏం తప్పు చేశాడు?

ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత మాజీ క్రికెటర్ సిద్దూ కెప్టెన్సీ అంశంపై స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ తో అతడు మాట్లాడాడు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించినందుకే అభిమానులు ఇలా చేస్తున్నారని అతడు స్పష్టం చేశాడు. "తమ హీరో, ఇండియన్ కెప్టెన్ తమ ఫ్రాంఛైజీ కెప్టెన్ కాడన్న నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. అతడు ఏం తప్పు చేశాడు"అని సిద్దూ ప్రశ్నించాడు.

ఇక అభిమానులు మళ్లీ తనను అభిమానించాలంటే హార్దిక్ పాండ్యా ఏం చేయాలో కూడా ఈ సందర్భంగా సిద్దూ చెప్పాడు. అంతేకాదు ధోనీని ఉదాహరణగా తీసుకోవాలని సూచించాడు. "విజయాన్ని మించింది ఏదీ లేదు. ముంబై ఇండియన్స్ గత రెండు మ్యాచ్ లలో గెలిచి ఉంటే అందరూ మౌనంగా ఉండేవారు. హార్దిక్ టీమ్ కాంబినేషన్ పై దృష్టి సారించాలి" అని సిద్దూ చెప్పాడు.

ధోనీని చూసి నేర్చుకో..

"మీరు 277 పరుగులు సమర్పించుకున్నారంటే ప్రతి ఒక్కరూ మీ బౌలింగ్ చెత్తగా ఉందనే అంటారు. టోర్నమెంట్లో అసాధారణమైన జట్టు 277 పరుగులు ఎలా ఇస్తుంది? గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ దగ్గరగా వచ్చారు. ఓడిపోయారు తప్ప అవమానం ఏమీ లేదు. ధోనీ ఏం చేస్తాడో చూడు. గతేడాది అత్యధిక పరుగులు చేసిన డెవోన్ కాన్వే లేకపోతే రచిన్ రవీంద్రను దించాడు. అతడు అలాంటి బ్యాటరే. అలాంటి ప్లేయర్స్ ను హార్దిక్ చూడాలి. లేదంటే అతని కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి"అని సిద్దూ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. దీంతో హార్దిక్ పాండ్యాపై విమర్శలు మరింత ఎక్కువవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో ఓటమితో ముంబై ఇండియన్స్ టేబుల్లో చివరి స్థానంలోకి పడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లోనూ టాస్ సందర్భంగా సొంత అభిమానులు కూడా హార్దిక్ పాండ్యాను హేళన చేశారు.

టాస్ సందర్భంగా అందరూ పాండ్యాను హేళన చేస్తూ గట్టిగా అరవడంతో హోస్ట్ గా ఉన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వాళ్లను హెచ్చరించాడు. అలా చేయడం సరికాదని అన్నాడు. అయితే సిద్దూ చెప్పినట్లు ముంబై ఇండియన్స్ మళ్లీ విజయాల బాట పడితేగానీ హార్దిక్ కు అభిమానుల నుంచి ఈ చికాకులు తప్పేలా లేవు. నిజానికి 2013 నుంచి 2023 మధ్య ముంబైని ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు రోహిత్ శర్మ. అలాంటి కెప్టెన్ ను తప్పించడంపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. రోహిత్ భార్య కూడా ఇది తప్పని గతంలో అనడం గమనార్హం.