కఠినమైన ఇంగ్లండ్ పర్యటనను యంగిండియా ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టింది. కోహ్లి, రోహత్ లాంటి వాళ్లు రిటైరైనా ఆ లోటు తెలియకుండా తొలి టెస్టు తొలి రోజే టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీల మోత మోగించారు. దీంతో తొలి రోజు టీమిండియా భారీ స్కోరు చేసింది. 80 ఓవర్లలో 3 వికెట్లకు 331 రన్స్ చేయడం విశేషం. రిషబ్ పంత్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
ఇంగ్లండ్ తో తొలి టెస్టు ప్రారంభానికి ముందు టీమిండియాపై అందరికీ సందేహాలే. కోహ్లి, రోహిత్ లను సేవలను ఒకేసారి కోల్పోవడంతో ఇంగ్లిష్ కండిషన్స్ లో మనవాళ్లు ఎలా రాణిస్తారో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మన బ్యాటర్లు తొలి రోజే చెలరేగిపోయారు. టాస్ ఓడినా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రావడం, పరిస్థితులు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో వాటిని సద్వినియోగం చేసుకున్నారు.
కెప్టెన్ గా తొలి టెస్టులోనే శుభ్‌మన్ గిల్ సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతనికిది ఆరో సెంచరీ కావడం విశేషం. విరాట్ కోహ్లిలాగే కెప్టెన్ గా తొలి టెస్టులోనే గిల్ కూడా సెంచరీ బాదాడు. అంతేకాదు ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన ఐదో టీమిండియా కెప్టెన్ గానూ నిలిచాడు.చివరిసారి 2018లో కోహ్లి కెప్టెన్ గా సెంచరీ చేయగా.. ఇప్పుడు గిల్ రిపీట్ చేశాడు. అతడు 140 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. వచ్చీరావడంతో ధాటిగా ఆడటం మొదలుపెట్టిన గిల్.. 14 ఫోర్లు, ఒక సిక్స్ బాది సెంచరీ చేశాడు.
అటు గిల్ మెరుపుల కంటే ముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతనికిది ఐదో సెంచరీ. కేఎల్ రాహుల్ తో కలిసి ఓపెనింగ్ చేసిన అతడు.. తొలి వికెట్ కు 91 పరుగులు జోడించాడు. రాహుల్ లంచ్ కు ముందు 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు ఉన్నాయి. ఆ వెంటనే తొలి టెస్టు ఆడుతున్న సాయి సుదర్శన్ డకౌటయ్యాడు.
అయితే లంచ్ తర్వాత కెప్టెన్ గిల్ తో కలిసి యశస్వి దూకుడు కొనసాగించాడు. రెండో సెషన్ లో సెంచరీ చేశాడు. మూడో వికెట్ కు గిల్ తో కలిసి 129 పరుగులు జోడించాడు. చివరికి 159 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్ తో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి ఔటైన తర్వాత కూడా రిషబ్ పంత్ తో కలిసి గిల్ మరో భాగస్వామ్యాన్ని నిర్మించాడు.