టీమిండియా వన్డే టీమ్ కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. రోహిత్ శర్మ స్థానాన్ని యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భర్తీ చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం శనివారం (అక్టోబర్ 4) బీసీసీఐ టీమ్ ను ప్రకటించింది. అజిగ్ అగార్కర్ సారథ్యంలో సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో ఇండియన్ టీమ్ ను ఎంపిక చేసింది. ఈ టీమ్ కు కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్‌ను ప్రకటించారు. ఇక భారత వన్డే క్రికెట్లో నూతన శకం మొదలు కానుంది.
ఇప్పటివరకూ భారత క్రికెట్ టీమ్ కు వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగాడు. ఇప్పుడు అతని స్థానంలో శుభ్‌మన్ గిల్ వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఇవాళ జట్టును ప్రకటించారు.పెర్త్‌లో అక్టోబర్ 19న ఈ సిరీస్ ప్రారంభమవుతుంది.
ప్రస్తుత జట్టు యాజమాన్యం 26 ఏళ్ల గిల్ సారథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలని అనుకుంటోంది. అందుకేే ఇప్పుడే వన్డే పగ్గాలు అప్పజెప్పింది. గిల్ ఇప్పటికే టెస్టుల్లో కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.
కెప్టెన్సీని మార్చే నిర్ణయం తీసుకునే ముందు సెలెక్టర్లు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో కూడా చర్చించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రోహిత్ టెస్టు ఫార్మాట్ నుండి రిటైర్ అయిన తర్వాత గిల్ ఆ ఫార్మాట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుండి రోహిత్ ముంబైలో తన సామర్థ్యం మేరకు సన్నద్ధమవుతున్నాడు. ఎందుకంటే అతను ఆస్ట్రేలియా పర్యటనకు ప్రధానంగా సిద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. అతను మాజీ టీమ్ ఇండియా సహాయ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి శిక్షణ పొందుతూ కనిపించాడు.
టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం ప్రకటించిన భారత వన్డే జట్టులో ఈ ఇద్దరు దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్ కు గిల్ కెప్టెన్. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
టీమ్: శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, సిరాజ్, ప్రసిద్ధ్.
టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ప్రయాణం పూర్తిగా ముగిసింది. అతని నాయకత్వంలో ఇండియా గతేడాది టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఈ విజయం తర్వాత రోహిత్, విరాట్ అంతర్జాతీయ టీ20ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా విజేతగా నిలిచింది.
రోహిత్ శర్మ వన్డేల్లో 56 మ్యాచ్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించాడు. 42 విజయాలు, 12 ఓటములు దక్కాయి. రోహిత్ 2021 డిసెంబర్‌లో విరాట్ కోహ్లీ స్థానంలో వన్డే కెప్టెన్‌గా నియమితులయ్యాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 2023లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ను గెలుచుకుంది. అదే వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడింది.
సంబంధిత కథనం