ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఇండియన్ కెప్టెన్, బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించిన వేళ.. రెండో టెస్టులో మన టీమ్ పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 587 పరుగులు చేసి ఆలౌటైంది.
కెప్టెన్ గా తొలి టెస్టులోనే సెంచరీతో రికార్డు క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్.. రెండో టెస్టులోనే డబుల్ సెంచరీతో మరో చరిత్ర సృష్టించాడు. అతడు ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్ బ్యాటర్, కెప్టెన్ గా నిలిచాడు. ఒక దశలో 211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన వేళ జడేజాతో కలిసి గిల్ టీమ్ ను ఆదుకోవడమే కాదు.. మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిపాడు.
ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ కెప్టెన్ అతడే. చివరికి గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్ లతో 269 రన్స్ చేయడం విశేషం. అతనికి యశస్వి జైస్వాల్ (87), చివర్లో జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) మంచి సహకారం అందించడంతో ఇండియన్ టీమ్ 151 ఓవర్లు ఆడి 587 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోస్ టంగ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
తొలి టెస్టులోనూ గిల్ సెంచరీ చేసినా దానిని భారీ సెంచరీగా మలచకపోవడం, టెయిలెండర్లు చేతులెత్తేయడంతో ఇండియన్ టీమ్ మంచి స్థితి నుంచి ఓటమి పాలైంది. ఆ తప్పు ఈసారి జరగకుండా శుభ్‌మన్ జాగ్రత్త పడ్డాడు. 211 పరుగులకే సగం వికెట్లు పడిపోయిన వేళ ఏకంగా 8 గంటల పాటు క్రీజులో నిలిచాడు. మొదట జడేజాతో కలిసి ఆరో వికెట్ కు 203 పరుగులు జోడించాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఏడో వికెట్ కు మరో 144 పరుగులు జత చేశాడు.
ఈ క్రమంలో తన టెస్ట్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ, ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇండియన్ కెప్టెన్, ఇండియన్ బ్యాటర్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. తొలి టెస్టులో టెయిలెండర్ల వైఫల్యం టీమిండియా ఓటమికి కారణం కాగా.. ఈసారి జడేజా, సుందర్ ఆ పొరపాటు రిపీట్ కాకుండా చూసుకోవడం కూడా కలిసి వచ్చింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది.
సంబంధిత కథనం