india vs england 3rd odi live: గిల్ సెంచరీ.. శ్రేయస్, కోహ్లి హాఫ్ సెంచరీలు..భారత్ భారీ స్కోరు
india vs england 3rd odi: ఇంగ్లండ్ తో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. శుభ్ మన్ గిల్ సెంచరీ.. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీలు చేయడంతో టీమ్ఇండియా 356 పరుగులు చేసింది.

అహ్మదాబాద్ లో బుధవారం (ఫిబ్రవరి 12) ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా సరిగ్గా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ (112) సెంచరీతో సత్తాచాటాడు. శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లి (52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. కేఎల్ రాహుల్ (40) కూడా రాణించాడు.
గిల్ అదుర్స్
వన్డేల్లో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ మూడో వన్డేలో చెలరేగాడు. తనకు ఎంతో ఇష్టమైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించి శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో రోహిత్ (1) త్వరగానే పెవిలియన్ చేరినా.. గిల్ మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. కోహ్లి, శ్రేయస్ తో కలిసి భారీ స్కోరు కు గిల్ బాటలు వేశాడు.
ఫామ్ లోకి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ కోహ్లి కూడా ఫామ్ అందుకున్నాడు. చక్కటి అర్ధశతకంతో అలరించాడు. మంచి రిథమ్ తో కనిపించాడు.కాన్ఫిడెన్స్ గా షాట్లు కొట్టాడు. అన్ని వైపులా పరుగులు రాబట్టాడు. శ్రేయస్ కూడా ఫామ్ కొనసాగించాడు. దూకుడుగా ఆడాడు. ఇక ఈ మ్యాచ్ లో అయిదో స్థానంలో వచ్చిన రాహుల్ కీలక పరుగులు సాధించాడు.
రషీద్ కు 4 వికెట్లు
ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మెరిశాడు. లెగ్ స్పిన్ తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. నాలుగు వికెట్లు తీశాడు. విరాట్, శుభ్ మన్, శ్రేయస్, హార్దిక్ (17)ల వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి, శ్రేయస్ ను సెంచరీ దిశగా సాగకుండా అడ్డుకున్నాడు. మరో ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం