గత రెండు మ్యాచ్ ల్లో ఫెయిల్ అయిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఊచకోతకు దిగాడు. ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను రప్ఫాడించాడు. శనివారం (ఏప్రిల్ 12) మ్యాచ్ లో 36 బాల్స్ లోనే 82 రన్స్ చేశాడు. 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. అతని బాదుడుతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, ఓ సిక్సర్) దంచికొట్టారు. షమి వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే ప్రభ్ సిమ్రన్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు.
షమి రెండో ఓవర్లో ప్రియాన్ష్ ఆర్య వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్.. ప్రభ్ సిమ్రన్ సిక్సర్ కొట్టడంతో 23 రన్స్ వచ్చాయి. 3 ఓవర్లకే టీమ్ స్కోరు 53కు చేరింది. ప్రియాన్ష్ ఔటైనా.. శ్రేయస్, ప్రభ్ సిమ్రన్ కలిసి బాదుడు కొనసాగించారు. పవర్ ప్లేలో ఆ టీమ్ 89/1తో నిలిచింది.
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సన్ రైజర్స్ బౌలర్లను చిత్తుచిత్తు చేసినా.. ఎషన్ మలింగ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ శ్రీలంక యంగ్ పేసర్ ఐపీఎల్ డెబ్యూ చేశాడు. తన తొలి ఓవర్లోనే ప్రభ్ సిమ్రన్ ను ఔట్ చేశాడు. కానీ మరో ఎండ్ లో శ్రేయస్ అసలు తగ్గలేదు. సిక్సర్లతో ఎదురు దాడి కొనసాగించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ లో శ్రేయస్ కు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.
నేహాల్ వధేరా (27)ను ఎల్బీగా ఔట్ చేసి రెండో వికెట్ సాధించాడు ఎషన్ మలింగ. కానీ రిప్లేలో బంతి స్టంప్స్ కు తగిలేది కాదని తేలింది. కానీ నేహాల్ రివ్యూ కోరకుండానే వెళ్లిపోయాడు. డీఆర్ఎస్ అడిగి ఉంటే వికెట్ కాపాడుకునేవాడు. ఆ వెంటనే శశాంక్ (2) కూడా ఔటైనా శ్రేయస్ దంచుడు మాత్రం ఆగలేదు.
హాఫ్ సెంచరీ తర్వాత శ్రేయస్ మరింతగా రెచ్చిపోయాడు. మలింగ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్ల్ తో సహా నాలుగు బౌండరీలు కొట్టాడు. దీంతో 17వ ఓవర్లోనే పంజాబ్ స్కోరు 200 దాటింది. శ్రేయస్ దూకుడు చూస్తే ఆ టీమ్ ఈజీగా 250 స్కోరు చేస్తుందేమో అనిపించింది.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ తెలివిగా బౌలింగ్ చేసి పంజాబ్ కింగ్స్ మరింత స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. మ్యాక్స్ వెల్ (3)తో పాటు శ్రేయస్ నూ బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన హర్షల్ 42 రన్స్ ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. 19వ ఓవర్లో కమిన్స్ 8 రన్స్ మాత్రమే చేశాడు.
కానీ షమి వేసిన లాస్ట్ ఓవర్లో స్టాయినిస్ విశ్వరూపమే చూపించాడు. లాస్ట్ 4 బాల్స్ కు నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో పంజాబ్ స్కోరు 240 దాటింది. 4 ఓవర్లు వేసిన షమి ఏకంగా 75 పరుగులు ఇవ్వడం గమనార్హం. స్టాయినిస్ 11 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం