IPL 2025 Shreyas Iyer: గుజరాత్‌తో మ్యాచ్‌లో కోచ్‌తో మాట్లాడేందుకు శ్రేయస్ ఇయర్ ఫోన్స్ వాడాడా? హర్ష భోగ్లే ఏం చెప్పాడు?-shreyas iyer uses ear piece to talk with coach ricky ponting from the ground what commentators said ipl 2025 pbks vs gt ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Shreyas Iyer: గుజరాత్‌తో మ్యాచ్‌లో కోచ్‌తో మాట్లాడేందుకు శ్రేయస్ ఇయర్ ఫోన్స్ వాడాడా? హర్ష భోగ్లే ఏం చెప్పాడు?

IPL 2025 Shreyas Iyer: గుజరాత్‌తో మ్యాచ్‌లో కోచ్‌తో మాట్లాడేందుకు శ్రేయస్ ఇయర్ ఫోన్స్ వాడాడా? హర్ష భోగ్లే ఏం చెప్పాడు?

IPL 2025 Shreyas Iyer: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీతోనూ సత్తాచాటాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కోచ్ తో మాట్లాడేందుకు శ్రేయస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని కామెంటేటర్స్ పేర్కొన్నారు.

ఆల్ రౌండర్ మార్కో యాన్సెన్ తో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (PTI)

గుజరాత్ టైటాన్స్ పై జట్టును గెలిపించిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కొత్త ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో, కెప్టెన్సీలో అతను అదరగొట్టాడు. 42 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఏకంగా 9 సిక్సర్లు కొట్టాడు. కెప్టెన్ గానూ బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా పేసర్ విజయ్ కుమార్ వైశాక్ ను ఆడించడం కలిసొచ్చింది.

ఇంపాక్ట్ ప్లేయర్ వైశాక్

గుజరాత్ టైటాన్స్ ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా పేసర్ విజయ్ కుమార్ వైశాక్ ను బరిలో దించింది. ఈ నిర్ణయం ఆ టీమ్ కు గొప్పగా కలిసొచ్చింది. ఆఖర్లో 3 ఓవర్లు వేసిన వైశాక్ 28 పరుగులే ఇచ్చి గుజరాత్ ను కట్టడి చేశాడు. ఈ యువ పేసర్ తన తొలి రెండు ఓవర్లలో 10 పరుగులే సమర్పించుకున్నాడు.

అంతకంటే ముందు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో లాస్ట్ ఓవర్ కు ముందు శ్రేయస్ 97 పరుగులతో నిలిచాడు. కానీ క్రీజులో ఉన్న శశాంక్ ను షాట్లు ఆడమని చెప్పిన శ్రేయస్ టీమ్ కోసం ఆలోచించే కెప్టెన్ గా ప్రశంసలు పొందుతున్నాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయానికి ముఖ్య కారణం చివరి ఓవర్లో శశాంక్ 5 ఫోర్లు కొట్టడం, బౌలింగ్ లో వైశాక్ సత్తాచాటడమే. దీంతో ఈ నిర్ణయాలకు కారణమైన శ్రేయస్ కెప్టెన్సీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

పాంటింగ్ తో

గుజరాత్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వ్యూహాల గురించి క్రిక్ బజ్ లో చర్చ సందర్భంగా కోచ్ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ గురించి మాట్లాడారు. హోస్ట్ సయామి ఖేర్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌండరీ లైన్లో ఎక్కువ సమయం గడపడం చూశాం. ఎందుకంటే పాంటింగ్ అతనితో ఎప్పటికప్పుడు గాల్లో మాట్లాడుతున్నాడు. ఫీల్డర్లు ఎక్కడికి వెళ్లాలి? బౌలింగ్ ఎవరు చేయాలి? అని చెబుతున్నాడు’’ అని సయామి పేర్కొంది. వెంటనే హర్ష భోగ్లే.. ‘‘అయ్యర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని మీరు అనుకుంటున్నారా?’’ అని సరదాగా తెలిపాడు.

బ్రార్ ను కాదని

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ హర్ ప్రీత్ బ్రార్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలని మొదట అనుకుంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ పంజాబ్ కింగ్స్ తరపున ఇప్పటికే సత్తాచాటాడు. కానీ గుజరాత్ ఛేజింగ్ లో మంచు ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీంతో బంతిపై స్పిన్నర్ బ్రార్ కు పట్టు చిక్కడం కష్టం. అంతే కాకుండా గుజరాత్ లెఫ్టార్మ్ బ్యాటర్స్ రూథర్ ఫర్డ్, రాహుల్ తెవాటియా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే వెంటనే బ్రార్ ను కాదని విజయ్ కుమార్ వైశాక్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం