మూవీ నైట్ ప్లాన్ చేసుకుంటే.. కెప్టెన్ నుంచి కాల్.. కట్ చేస్తే జట్టులోకి శ్రేయ‌స్ అయ్యర్.. అర్ధశ‌త‌కంతో అదుర్స్-shreyas iyer gets late night call from rohit to play 1st odi vs england ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  మూవీ నైట్ ప్లాన్ చేసుకుంటే.. కెప్టెన్ నుంచి కాల్.. కట్ చేస్తే జట్టులోకి శ్రేయ‌స్ అయ్యర్.. అర్ధశ‌త‌కంతో అదుర్స్

మూవీ నైట్ ప్లాన్ చేసుకుంటే.. కెప్టెన్ నుంచి కాల్.. కట్ చేస్తే జట్టులోకి శ్రేయ‌స్ అయ్యర్.. అర్ధశ‌త‌కంతో అదుర్స్

Chandu Shanigarapu HT Telugu
Published Feb 07, 2025 11:07 AM IST

shreyas iyer: ఇంగ్లండ్ తో తొలి వన్డేలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ మెరుపు అర్ధశ‌త‌కంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి ఈ మ్యాచ్ కు రిజర్వ్ బెంచీ మీద కూర్చోవాల్సిన అతను ముందు రోజు రాత్రి మూవీ చూస్తూ ఎంజాయ్ చేశాడు. కానీ కోహ్లీకి గాయమవడంతో కెప్టెన్ కాల్ తో అలర్ట్ అయిన అతను మ్యాచ్ కు రెడీ అయ్యాడు.

ఇంగ్లండ్ తో తొలి వన్డేలో మెరిసిన శ్రేయస్ అయ్యర్
ఇంగ్లండ్ తో తొలి వన్డేలో మెరిసిన శ్రేయస్ అయ్యర్ (AFP)

ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ కు అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. రాత్రంతా మూవీ చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న అతను.. తర్వాతి రోజు మధ్యాహ్నం మైదానంలో అడుగుపెట్టి అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మ్యాచ్ లో సత్తాచాటిన శ్రేయస్ కు అసలు తుది జట్టులో చోటే దక్కేది కాదు. కానీ కోహ్లి మోకాలి వాపు శ్రేయస్ కు వరంలా మారింది. దీంతో దొరికిన ఛాన్స్ ను అతను వంద శాతం సద్వినియోగం చేసుకున్నాడు.

మూవీ చూస్తుంటే కెప్టెన్ కాల్

శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, కేెఎల్ రాహుల్ ఉండటంతో తొలి వన్డేకు శ్రేయస్ ను పక్కనపెట్టాలని మేనేజ్ మెంట్ నిర్ణయించుకుంది. ఈ విషయం శ్రేయస్ కు కూడా తెలుసు కాబట్టి మ్యాచ్ ముందు రోజు (ఫిబ్రవరి 5) రాత్రి మూవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు. మరోవైపు కుడి మోకాలు వాపుతో ఇబ్బంది పడ్డ కోహ్లి మ్యాచ్ ఆడే స్థితిలో లేడు. దీంతో ఆ రాత్రి సమయంలో కెప్టెన్ రోహిత్ వెంటనే శ్రేయస్ కు కాల్ చేశాడు. మ్యాచ్ లో ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. వెంటనే హోటల్ గదిలోకి వెళ్లి శ్రేయస్ నిద్రపోయాడు. తర్వాతి రోజు (ఫిబ్రవరి 6) మ్యాచ్ ఆడి సత్తాచాటాడు.

కోహ్లి వస్తే ఎలా?

ఇంగ్లండ్ తో తొలి వన్డేలో బెంచీపై కూర్చోవాల్సిన శ్రేయస్ అవకాశం రాగానే వచ్చి అర్ధశతకం బాదాడు. మంచి ప్రదర్శన చేశాడు. జట్టును గెలుపు వైపు నడిపించాడు. కానీ రెండో వన్డేకు కోహ్లి అందుబాటులో వస్తే అప్పుడు శ్రేయస్ పరిస్థితి ఏంటి? జట్టులో చోటు ఉంటుందా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఓపెనర్లుగా రోహిత్, జైశ్వాల్ ఆడటంతో గిల్ మూడో స్థానంలోకి వచ్చాడు. మరి కోహ్లి వస్తే అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారే అవకాశం ఉంది. మరి నాలుగో స్థానంలో ఆడే శ్రేయస్ కు ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి.

శ్రేయస్ నిలకడగా

గత కొంతకాలంగా వన్డేల్లో శ్రేయస్ నిలకడగా రాణిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో 66.25 సగటుతో 468 పరుగులు చేశాడు. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ 63 వన్డేల్లో 47.69 సగటుతో 2480 పరుగులు సాధించాడు. ఆట పరంగా ప్రదర్శన బాగానే ఉన్నా.. బీసీసీఐ చెప్పినా దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో శ్రేయస్ ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆటపై మరింత ఫోకస్ పెట్టిన శ్రేయస్ తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

Whats_app_banner