అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగమ్మాయి.. శ్రీచరణికి నాలుగు వికెట్లు.. ఇంగ్లాండ్ ను చిత్తుచిత్తు చేసిన టీమిండియా-shree charani took four wickets smriti mandhana century helps indian women team to beat england by 97 runs ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగమ్మాయి.. శ్రీచరణికి నాలుగు వికెట్లు.. ఇంగ్లాండ్ ను చిత్తుచిత్తు చేసిన టీమిండియా

అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగమ్మాయి.. శ్రీచరణికి నాలుగు వికెట్లు.. ఇంగ్లాండ్ ను చిత్తుచిత్తు చేసిన టీమిండియా

తెలుగమ్మాయి అదరగొట్టింది. ఏపీకి చెందిన శ్రీ చరణి సత్తాచాటింది. టీమిండియా తరపున అరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ లో స్మృతి.. బౌలింగ్ లో శ్రీ చరణి చెలరేగడంతో ఇంగ్లాండ్ ను భారత మహిళల జట్టు చిత్తుచిత్తుగా ఓడించింది.

వికెట్ తీసిన శ్రీచరణిని అభినందిస్తున్న సహచర క్రికెటర్లు (Action Images via Reuters)

భారత వుమెన్స్ క్రికెట్ జట్టు అదరగొట్టింది. బ్యాటింగ్ లో కెప్టెన్ స్మృతి మంధాన (62 బంతుల్లో 112; 15 ఫోర్లు, 3 సిక్సర్లు).. బౌలింగ్ లో తెలుగమ్మాయి శ్రీ చరణి (4/12) చెలరేగడంతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. శనివారం (జూన్ 28) ఇంగ్లాండ్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇంగ్లాండ్ ఢమాల్

ఇండియాతో తొలి టీ20లో ఛేజింగ్ లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ తేలిపోయింది. 211 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆ టీమ్ లో కెప్టెన్ నాట్ సీవర్ (66) మాత్రమే పోరాడింది. మిగతా బ్యాటర్లలో అర్లోట్, బీమాంట్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

బౌలింగ్ అదుర్స్

ఇంగ్లాండ్ గడ్డపై బౌలింగ్ లోనూ భారత మహిళల జట్టు సత్తాచాటింది. ముఖ్యంగా టీ20 అరంగేట్రంలోనే ఏపీ అమ్మాయి శ్రీ చరణి అదరగొట్టింది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ బంతితో మ్యాజిక్ చేసింది. క్యాప్సీ వికెట్ తో అంతర్జాతీయ టీ20ల్లో ఫస్ట్ వికెట్ సాధించింది చరణి. ఆ తర్వాత ఎకిల్ స్టోన్ ను ఔట్ చేసింది. అనంతరం ఒకే ఓవర్లో సీవర్, లారెన్ ను పెవిలియన్ చేర్చి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగించింది.

భారత బౌలర్లలో రాధా యాదవ్, దీప్తి శర్మ కూడా రాణించారు. చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 97 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో ఓడింది. మహిళల టీ20ల్లో పరుగుల పరంగా ఇంగ్లాండ్ కు ఇదే అతి పెద్ద ఓటమి.

వారెవా స్మృతి

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత ఇన్నింగ్స్ లో కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగే హైలైట్. హర్మన్ ప్రీత్ కౌర్ దూరమవడంతో ఈ మ్యాచ్ లో స్మృతి కెప్టెన్ గా వ్యవహరించింది. మరో ఓపెనర్ షెఫాలి వర్మ (22 బంతుల్లో 20) వేగంగా ఆడలేకపోయినా స్మృతి ఫస్ట్ నుంచే బాదుడు మొదలెట్టింది. ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టింది.

అదే జోరు

షెఫాలి ఔటైనా.. హర్లీన్ డియోల్ (43)తో కలిసి స్మృతి జోరు కొనసాగించింది. అనంతరం ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో మాత్రం స్మృతి దంచికొట్టి సెంచరీ కంప్లీట్ చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఆమెకు ఇదే ఫస్ట్ సెంచరీ. ఓపెనర్ గా వచ్చిన స్మృతి లాస్ట్ ఓవర్ రెండో బాల్ కు ఔటైంది. 62 బంతుల్లోనే 112 పరుగులు చేసిన ఆమె.. 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం