Rohit Sharma: రోహిత్ కు షాక్.. ఇక టెస్టుల్లో నో ఛాన్స్.. బుమ్రానే కెప్టెన్!
Rohit sharma: టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్లే. అతణ్ని తిరిగి టెస్టు జట్టులోకి తీసుకునే అవకాశం లేదని సమాచారం. బుమ్రాకే టెస్టు పగ్గాలు. అందుకే ముందు జాగ్రత్తగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించట్లేదు.

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు షాక్. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. ఇక టెస్టుల్లోనూ కనబడడు. అతని టెస్టు కెరీర్ కు బీసీసీఐ ఎండ్ కార్డు వేసిందని తెలిసింది. టీమ్ఇండియా టెస్టు పగ్గాలను బుమ్రాకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. అందుకే బుమ్రా ఫిట్ గానే ఉన్నా ముందు జాగ్రత్త కోసం ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని పీటీఐ పేర్కొంది.
రోహిత్ ఔట్
రోహిత్ ను ఇకపై టెస్టుల్లో ఆడించొద్దని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందనే వార్త సంచలనం రేపుతోంది. 2024లో రోహిత్ టెస్టుల్లో చెత్త ప్రదర్శనతో 25 కంటే తక్కువ సగటే నమోదు చేశాడు. తన చివరి ఎనిమిది టెస్టుల్లో 10.9 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. అంతే కాకుండా రోహిత్ కెప్టెన్ గా ఉన్న గత ఆరు టెస్టుల్లో భారత్ ఓడిపోయింది.
అప్పటికీ 40 ఏళ్లు
బ్యాటర్ గా, కెప్టెన్ గా రోహిత్ టెస్టుల్లో ఇటీవలి ప్రదర్శన పేలవంగా ఉండటంతో అతనిపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైందని పీటీఐ తెలిపింది. ఇప్పటికే రోహిత్ తో ఈ మేరకు బీసీసీఐ చర్చలు జరిపిందని కూడా వెల్లడించింది. ఏప్రిల్ నాటికి రోహిత్ కు 38 ఏళ్లు. తర్వాతి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ వచ్చేసరికి 40 ఏళ్లు వస్తాయి. దీంతో టెస్టుల్లో నూ రోహిత్ కెరీర్ ఇక ముగిసినట్లే.
కెప్టెన్ బుమ్రా
రోహిత్ ఇక టెస్టులకు దూరమయ్యే నేపథ్యంలో తర్వాతి కెప్టెన్ గా బుమ్రాను బోర్డు ప్రకటించనుంది. ఇప్పటికే టెస్టుల్లో బుమ్రా వైస్ కెప్టెన్. మూడు టెస్టుల్లోనూ జట్టును నడపించాడు. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో సారథిగా బుమ్రా ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ప్రస్తుతం బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా భవిష్యత్ పై ఫోకస్ పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని తెలిసింది.
అప్పుడే పగ్గాలు
బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో బౌలింగ్ ప్రారంభించలేదు. అతణ్ని కాపాడుకోవాల్సిన అవసరం భారత జట్టుకు ఉంది. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించే రిస్క్ తీసుకోలేదు. ఐపీఎల్ తో బుమ్రా రిథమ్ అందుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్-జులైలో ఇంగ్లండ్ టూర్ లో టెస్టు సిరీస్ కు బుమ్రా పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
సంబంధిత కథనం