Team India: 2023లో టీమిండియాలోకి ఎంట్రీ - కట్ చేస్తే ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాని క్రికెటర్లు వీళ్లే!
Team India: 2023లో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన కొందరు ఐపీఎల్ స్టార్స్...ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులో కనిపించలేదు. ఈ ఏడాది టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ వారికి దక్కలేదు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
Team India: నేషనల్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని ప్రతి క్రికెటర్ కలలు కంటుంటారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే ప్రతిభతో పాటు కూసింత లక్ కూడా ఉండాల్సిందే. దేశవాళీల్లో పరుగుల వరద పారించినా జాతీయ జట్టులో సెలెక్ట్ కాకుండానే కెరీర్‌ను ముగించిన క్రికెటర్లు చాలా మందే కనిపిస్తారు. ఇదివరకటితో పోలిస్తే ఐపీఎల్ పుణ్యమా అని ఇప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం కాస్తంత ఈజీగా మారిపోయింది. అదే టైమ్‌లో పోటీ పెరిగిపోయింది.
ఒకటి రెండు మ్యాచ్‌లతోనే...
ఐపీఎల్ కారణంగా ప్రతి ఏటా పదుల సంఖ్యలో కొత్త క్రికెటర్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తోన్నారు. ఇందులో కొందరు తమ టాలెంట్‌తో జట్టులో స్థానం పదిల పరుచుకుంటే మరికొందరు మాత్రం ఒకటి రెండు మ్యాచ్‌లతోనే కనిపించకుండాపోతున్నారు.
ఐపీఎల్ స్టార్స్...
2023లో టీ20 ఫార్మెట్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు ఐపీఎల్ స్టార్స్‌కు ఈ ఏడాది జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ దక్కలేదు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
రాహుల్ త్రిపాఠి…
గత ఏడాది శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ద్వారా టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు రాహుల్ త్రిపాఠి. ఐపీఎల్‌లో గత కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తోన్న ఈ హిట్టర్ ఈ టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచుల్లో కలిపి కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ తర్వాత టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ అతడికి ఛాన్స్ దక్కలేదు.
శివమ్ మావి...
బోలెండంత టాలెంట్ ఉన్నా అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాని క్రికెటర్లలో శివమ్ మావి ఒకరు. 2023 జనవరిలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌తో శివమ్ మావి టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు దక్కించుకున్న మూడో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఆ తర్వాత మ్యాచుల్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించకపోవడంతో శివమ్ మావి మళ్లీ నేషనల్ టీమ్‌లో కనిపించలేదు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.
ఆసియా గేమ్స్...
ఆల్ రౌండర్ ఆర్ సాయికిషోర్‌తో పాటు షాబాజ్ అహ్మద్ గత ఏడాది జరిగిన ఆసియా గేమ్స్‌తో నేషనల్ టీమ్‌లోకి అరంగేట్రం చేశారు. ఆసియా గేమ్స్ తర్వాత వీరిద్దరికి టీమిండియా తరఫున ఆడే ఛాన్స్ మళ్లీ రాలేదు.