ఆయూష్ మాత్రె (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు.. శివమ్ దూబె (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్ లు కలిపి చెన్నై సూపర్ కింగ్స్ ఫైటింగ్ స్కోరు చేసింది.
ఆదివారం (ఏప్రిల్ 20) వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. సీఎస్కే తరపున ఆడిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా 17 ఏళ్ల ఆయూష్ మాత్రె హిస్టరీ క్రియేట్ చేశాడు.
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సీఎస్కే ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. కొత్త బంతితో ముంబయి పేసర్లు కట్టడి చేయడంతో 3 ఓవర్లకు స్కోరు 16 మాత్రమే. ఆ వెంటనే అశ్వని కుమార్ తన తొలి బాల్ కే రచిన్ రవీంద్ర (5)ను ఔట్ చేశాడు.
కానీ ఐపీఎల్ అరంగేట్రంలో సీఎస్కే యంగ్ బ్యాటర్ ఆయూష్ మాత్రె చెలరేగాడు. అశ్వని ఓవర్లోనే వరుసగా 4, 6, 6 కొట్టాడు. ఉన్నంత సేపు చెలరేగాడు. కానీ చివరకు అతని మెరుపులకు దీపక్ చాహర్ ఎండ్ కార్డు వేశాడు. 15 బంతుల్లోనే 32 పరుగులు చేసిన ఆయూష్ 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేసిన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ (19)ను శాంట్నర్ పెవిలియన్ చేర్చాడు. 10 ఓవర్లకు సీఎస్కే స్కోరు 70/3.
సీఎస్కే ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా, శివమ్ దూబె క్రీజులో నిలిచారు. అయినా ఆ టీమ్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఫస్ట్ వికెట్ కాపాడుకునేందుకు ఈ జోడీ ప్రాధాన్యతనిచ్చింది. దీంతో 8 నుంచి 11 వరకు 4 ఓవర్లలో 14 రన్స్ మాత్రమే వచ్చాయి.
ఫస్ట్ 18 బాల్స్ లో దూబె 15 రన్స్, 16 బాల్స్ లో జడేజా 17 రన్స్ మాత్రమే చేశారు. అయితే హార్దిక్ వేసిన 14వ ఓవర్లో సిక్సర్ తో దూబె జోరందుకున్నాడు. అశ్వని కుమార్ బౌలింగ్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. జడేజా కూడా ఓ సిక్సర్, ఫోర్ బాదడంతో ఆ ఓవర్లో 24 రన్స్ వచ్చాయి.
30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు శివమ్ దూబె. 16 ఓవర్లకు 142/3తో నిలిచిన సీఎస్కే.. ఈజీగా 190కి పైగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ కరెక్ట్ టైమ్ లో బుమ్రా అదరగొట్టాడు. 17వ ఓవర్లో దూబెను ఔట్ చేసి 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 18వ ఓవర్లో శాంట్నర్ 6 రన్స్ ఇచ్చాడు. 19వ ఓవర్లో ధోని (4) వికెట్ ను బుమ్రా దక్కించుకున్నాడు.
కానీ ఆఖరి ఓవర్లో జడేజా 6, 4 తో హాఫ్ సెంచరీ అందుకోవడంతో పాటు సీఎస్కే స్కోరును 170 దాటించాడు. బుమ్రా 4 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
సంబంధిత కథనం