Shivam Dube: ధోనీయే నా గురించి ఆ మాట చెప్పినప్పుడు నేను ఆడకుండా ఎలా ఉంటాను: శివమ్ దూబె
Shivam Dube: ఆఫ్ఘనిస్థాన్ పై తొలి టీ20లో టీమిండియా సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించిన శివమ్ దూబె మ్యాచ్ తర్వాత ధోనీని గుర్తు చేశాడు. నేను చాలా బాగా ఆడతానని ధోనీయే చెప్పినప్పుడు ఆడకుండా ఎలా ఉంటానని అతడు అన్నాడు.
Shivam Dube: టీమిండియాలో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా లేని లోటును ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో తీర్చాడు ఆల్ రౌండర్ శివమ్ దూబె. మొదట బంతితో 2 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి వికెట్ తీసుకున్న అతడు.. తర్వాత చేజింగ్ లో 40 బంతుల్లోనే 60 రన్స్ చేసి ఇండియాను గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత అతడు మాజీ కెప్టెన్ ధోనీని గుర్తు చేసుకున్నాడు.
శివమ్ దూబె చాలా రోజులుగా నేషనల్ సెలక్టర్ల దృష్టిలో ఉన్నా.. 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో అతన్ని తీసుకున్నప్పటి నుంచే దూబె దశ తిరిగింది. గత సీజన్ ఐపీఎల్లో ఏకంగా 158 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసి ఇండియన్ టీమ్ లోకి వచ్చాడు. ఐపీఎల్ 2023లో చెన్నై తరఫున 418 రన్స్ కూడా చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు.
మొత్తానికి ఆఫ్ఘనిస్థాన్ తో తొలి టీ20లో తనకు వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో సెలక్టర్లు అతనికి పిలుపునిచ్చారు. తొలి మ్యాచ్ లో ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ తర్వాత అతడు తన ఆటతీరు మెరుగవడానికి ధోనీయే కారణమని చెప్పాడు.
ధోనీ చెప్పాడు.. నేను ఆడాను: శివమ్ దూబె
మ్యాచ్ తర్వాత దూబె మాట్లాడుతూ.. "మహీ భాయ్ తో నేను మాట్లాడుతూ ఉంటాను. అతడో పెద్ద ప్లేయర్, లెజెండ్. అతని నుంచి నేను నేర్చుకుంటూనే ఉంటాను. అతన్ని పరిశీలిస్తుంటాను. వివిధ పరిస్థితుల్లో ఎలా ఆడాలో చెబుతూ ఉంటాడు. కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడు. నేనో మంచి ప్లేయర్ అని అతడు చాలా సార్లు చెప్పాడు. అతడే నన్ను మంచి ప్లేయర్ అంటున్నప్పుడు నేను కచ్చితంగా బాగా ఆడతాను. నేను చాలా కాన్ఫిడెన్స్ తో ఆడాను" అని అన్నాడు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చెబుతూ.. బౌలింగ్ లోనూ అతడు తనకు ప్రతి మ్యాచ్ లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించాడు. "ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. అది రాత్రికి రాత్రే రాలేదు. చాలా రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. బౌలింగ్ చేసే అవకాశం కూడా ఎదురు చూస్తున్నాను. మొత్తానికి ఈరోజు ఆ అవకాశం దక్కింది. దానిని ఉపయోగించుకున్నాను. మ్యాచ్ పరిస్థితిని బట్టి ప్రతి మ్యాచ్ లో నాకు 2, 3 ఓవర్లు వేసే అవకాశం ఇస్తానని రోహిత్ చెప్పాడు. అది నాకు చాలా సానుకూల అంశం. నేను రెగ్యులర్ గా బౌలింగ్ చేస్తాను" అని దూబె చెప్పాడు.
ఆఫ్ఘనిస్థాన్ తో తొలి టీ20లో తాను ఆడిన తీరుతో ఈ ఏడాది జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం రేసులో నిలిచాడు. తనకు కూడా వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ కు ఆడటం ఓ కల అని, ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నట్లు తెలిపాడు.