Shikhar Dhawan: రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకే ఆ క్రికెట్ లీగ్‌లో చేరిపోయిన శిఖర్ ధావన్..
Shikhar Dhawan: శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకే మరో క్రికెట్ లీగ్ లో చేరిపోయాడు. అతడు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ కు శనివారం (ఆగస్ట్ 24) గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందంటూ తాజాగా లీగ్ లో చేరిన సందర్భంగా అతడు చెప్పడం విశేషం.
Shikhar Dhawan: శిఖర్ ధావన్ ఇప్పుడు లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో చేరాడు. ఈ టీమిండియా మాజీ ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రెండు రోజుల్లోనే ఇలా మరో లీగ్ ఆడటానికి సిద్ధమవడం విశేషం. వైట్ బాల్ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన ఈ స్టార్ ఓపెనింగ్ బ్యాటర్.. తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని ఈ సందర్భంగా చెప్పాడు.
లెజెండ్ లీగ్ క్రికెట్‌లో శిఖర్ ధావన్
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గత శనివారం (ఆగస్ట్ 24) ఉదయం సడెన్‌గా తాను రిటైరవుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల్లో అతడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో చేరాడు. ఈ మేరకు అతడు చేసిన కామెంట్స్ ఇవీ అంటూ ఎల్ఎల్‌సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
"లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో చేరడం నా రిటైర్మెంట్ తర్వాత నేను వేసే సరైన ముందడుగు అని అనుకుంటున్నాను. ఈ ఆట కోసం అవసరమైనట్లు ఇంకా నా శరీరం ఉంది. క్రికెట్ నా నుంచి విడదీయలేని భాగం. అది నా నుంచి ఎప్పటికీ పోదు. నా క్రికెటింగ్ ఫ్రెండ్స్ తో మళ్లీ కలవడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఈ లీగ్ ద్వారా నా అభిమానులకు మరింత వినోదం పంచుతాను" అని ధావన్ అన్నాడు.
వచ్చే నెలలోనే లీగ్
లెజెండ్స్ లీగ్ క్రికెట్ వచ్చే నెలలోనే కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన క్రికెటర్లు ఈ లీగ్ లో పాల్గొంటున్నారు. గతేడాది నవంబర్ లో జరిగిన ఈ టోర్నీ.. ఈసారి రెండు నెలలు ముందుగానే సెప్టెంబర్ లోనే జరగబోతోంది. ఈసారి లీగ్ లో ఈ గబ్బర్ సింగ్ కూడా చేరనుండటంతో మరింత ఆసక్తికరంగా మారనుంది.
అంతర్జాతీయ క్రికెట్ లో శిఖర్ ధావన్ కు మంచి రికార్డు ఉంది. అతడు మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 269 మ్యాచ్ లలో 10867 రన్స్ చేశాడు. సగటు 40 కావడం విశేషం. అందులో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఉన్నాయి. ఇప్పటి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విజయవంతమైన ఓపెనింగ్ జోడీల్లో ఒకటిగా నిలవడంలో ధావన్ కీలకపాత్ర పోషించాడు. అయితే చాలా కాలంగా అతన్ని నేషనల్ సెలక్టర్లు పక్కన పెట్టారు.
ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ విషయానికి వస్తే గతేడాది జరిగిన సీజన్లో అర్బనైజర్స్ హైదరాబాద్ ను ఓడించి మణిపాల్ టైగర్స్ విజేతగా నిలిచింది. ఈ లీగ్ లో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, బిల్వారా కింగ్స్, సదరన్ సూపర్‌స్టార్స్ లాంటి టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి.