Shikhar Dhawan on World Cup: నువ్వు గొప్పోడివి బాసూ.. శిఖర్ ధావన్ ట్వీట్‌కు ఫ్యాన్స్ ఫిదా
Shikhar Dhawan on World Cup: తనను వరల్డ్ కప్ టీమ్‌లోకి ఎంపిక చేయకపోవడంపై శిఖర్ ధావన్ ఫస్ట్ రియాక్షన్ ఇదీ. బుధవారం (సెప్టెంబర్ 6) రాత్రి అతడు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
Shikhar Dhawan on World Cup: వరల్డ్ కప్ 2023 కోసం ఎంపిక చేసిన జట్టులో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు చోటు దక్కని విషయం తెలుసు కదా. దీనిపై చాలా మంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ధావన్ తోపాటు సంజూ శాంసన్, చహల్, భువనేశ్వర్ లాంటి వాళ్లను ఎంపిక చేయకపోవడం అన్యాయమని అన్నారు. వీళ్లను కాదని సూర్యకుమార్ ను ఎంపిక చేయడాన్నీ తప్పుబట్టారు.
అయితే తొలిసారి శిఖర్ ధావన్ దీనిపై స్పందించాడు. బుధవారం (సెప్టెంబర్ 6) రాత్రి అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తనను ఎంపిక చేయకపోవడంపై ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయని ధావన్.. రోహిత్ సేనకు మద్దతిచ్చాడు. వెళ్లి మీ ప్రతాపం చూపండి.. ట్రోఫీ గెలవండని అతడు ట్వీట్ చేయడం విశేషం.
"వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కోసం ఇండియాకు ప్రాతినిధ్యం వహించబోతున్న నా సహచర టీమ్మేట్స్, ఫ్రెండ్స్ కు శుభాకాంక్షలు. దేశంలోని 150 కోట్ల మంది ప్రజలు ప్రార్థనలు, మద్దతుతోపాటు మా ఆశలు, కలలను మీరు మోస్తున్నారు. మీరు కప్పు గెలిచి మమ్మల్ని గర్వంగా ఫీలయ్యేలా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతాపం చూపించండి టీమిండియా.. చక్ దె ఫట్టే" అంటూ సోషల్ మీడియా ద్వారా ధావన్ స్పందించాడు.
ఈ ట్వీట్ వెంటనే వైరల్ గా మారింది. తనను ఎంపిక చేయకపోయినా.. అదంతా మనసులో పెట్టుకోకుండా టీమ్ కు అండగా ఉన్న ధావన్ పెద్ద మనసును ఫ్యాన్స కొనియాడారు. నువ్వు గొప్పోడివి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిపోవడంతో ధావన్ లాంటి సీరియర్ కు చోటు దక్కడం లేదు.
ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ లాంటి యువ ప్లేయర్స్ తమను తాము నిరూపించుకున్న తర్వాత ధావన్ క్రమంగా జట్టులో చోటు కోల్పోయాడు. పైగా గతేడాది వన్డేల్లో అతని ఫామ్ దారుణంగా ఉంది. కేవలం 74.21 స్ట్రైక్ రేట్, 34.4 సగటుతో పరుగులు చేశాడు. మరోవైపు వన్డేల్లో ఇషాన్, గిల్ లాంటి వాళ్లు డబుల్ సెంచరీలు చేయడంతో ధావన్ తిరిగి జట్టులోకి రావడం అసాధ్యంగా మారింది.