Shakib Al Hasan: సెహ్వాగ్ ఎవరు: తనపై విమర్శలకు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ఘాటు రియాక్షన్
Shakib Al Hasan: సెహ్వాగ్ ఎవరు అంటూ టీమిండియా మాజీ ప్లేయర్ పై బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబల్ హసన్ తీవ్రంగా స్పందించాడు. తనపై వచ్చే విమర్శలకు ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడు.

Shakib Al Hasan: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పై మండిపడ్డాడు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్. శ్రీలంక, సౌతాఫ్రికాలతో మ్యాచ్ లలో అతడు విఫలమైన తర్వాత వీరూ విమర్శించాడు. దీనిపై తాజాగా గురువారం (జూన్ 13) నెదర్లాండ్స్ పై బంగ్లాదేశ్ గెలిచిన తర్వాత షకీబ్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో అతడు కేవలం 46 బంతుల్లో 64 పరుగులు చేసి తన టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
సెహ్వాగ్ ఎవరు?
నెదర్లాండ్స్ పై మ్యాచ్ గెలిచిన తర్వాత షకీబ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తనపై సెహ్వాగ్ చేసిన విమర్శల గురించి ప్రస్తావించగా.. ఆ ప్రశ్న పూర్తి కాకముందే సెహ్వాగ్ ఎవరు అనేలా ఎదురు ప్రశ్నించాడు. విమర్శలకు స్పందించడం ఓ ప్లేయర్ పని కాదని, బాగా రాణించి మ్యాచ్ గెలిపించడమే వాళ్లు చేయాల్సిన పని అని షకీబ్ అన్నాడు.
"ఓ ప్లేయర్ ప్రశ్నలకు బదులివ్వడానికి రాడు. ఓ ప్లేయర్ బ్యాట్స్‌మన్ అయితే అతడు బ్యాటుతో రాణించి టీమ్ కు తనవంతు తోడ్పడాలి. ఓ బౌలర్ అయితే బౌలింగ్ బాగా చేయాలి. వికెట్ అనేది ఓ అదృష్టం. ఓ ఫీల్డర్ అయితే ప్రతి పరుగు ఆపడానికి ప్రయత్నించడంతోపాటు సాధ్యమైనన్ని ఎక్కువ క్యాచ్ లు పట్టుకోవాలి. ఇక్కడ ఎవరికీ ఏ సమాధానం చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఓ ప్లేయర్ కు తాను జట్టు విజయంలో ఎంత పాత్ర పోషించగలనని మాత్రమే చూడాలి. ఒకవేళ ఆ పని చేయకపోతే సహజంగానే దానిపై చర్చలు నడుస్తుంటాయి. అందులో తప్పేం లేదు" అని షకీబ్ అన్నాడు.
సెహ్వాగ్ ఏమన్నాడంటే..
టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఆడిన తొలి రెండు మ్యాచ్ లలోనూ షకీబ్ విఫలమయ్యాడు. అటు బ్యాట్ తో, ఇటు బంతితో ఏమీ చేయలేకపోయాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచ్ లో బంగ్లా టీమ్ కేవలం 4 పరుగులతో ఓడింది. దీంతో ఈ ఓటమికి షకీబ్ ను బాధ్యుడిని చేస్తూ సెహ్వాగ్ తీవ్రమైన కామెంట్స్ చేశాడు. జట్టు నుంచి తప్పుకోవాలని సూచించాడు.
"నీకు ఎంతో అనుభవం ఉంది. గతంలో కెప్టెన్ గా కూడా ఉన్నావు. కానీ నీ గణాంకాలు బాగాలేవు. నువ్వు సిగ్గు పడాలి. టీ20 ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నానని ప్రకటించాలి" అని సౌతాఫ్రికాతో బంగ్లా ఓటమి తర్వాత క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ సెహ్వాగ్ అన్నాడు.
"ఒకవేళ అతన్ని కేవలం అనుభవం ప్రకారమే జట్టులోకి తీసుకుంటే అతనిలో అది కనిపించడం లేదు. పిచ్ పై కాస్త సమయం గడుపు. నువ్వేదో హేడెన్, గిల్‌క్రిస్ట్ కాదు.. ప్రతి షార్ట్ బాల్ పుల్ షాట్ ఆడటానికి. నువ్వు కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్లేయర్ మాత్రమే. నీ స్టాండర్డ్స్ ప్రకారం ఆడు. నువ్వు హుక్, పుల్ షాట్లు ఆడలేకపోతే.. నీకు తెలిసిన షాట్లు మాత్రమే ఆడు" అంటూ సెహ్వాగ్ చాలా తీవ్రంగా స్పందించాడు.
అయితే నెదర్లాండ్స్ పై హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ ను గెలిపించిన తర్వాత షకీబ్ ఇలా తీవ్రంగా స్పందించాడు. సెహ్వాగ్ కు తన ఆటతోనే సమాధానమిచ్చాడు.