Sehwag India WC XI: వరల్డ్ కప్ 2023లో ఇండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది? సూర్యకుమార్ కు చోటు దక్కుతుందా? మిడిలార్డర్ లో పోటీ ఎక్కువైన నేపథ్యంలో ఫైనల్ ఎలెవన్ ఎంపిక టీమ్ మేనేజ్‌మెంట్ కు సవాలుగా మారనుంది. అయితే దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయం చెప్పేశాడు. సూర్యకుమార్ కు చోటు దక్కదని తేల్చేశాడు.
వరల్డ్ కప్ లో టీమిండియా తుది జట్టులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ లో ఆడతారని సెహ్వాగ్ అన్నాడు. వన్డే క్రికెట్ లో సూర్యకుమార్ పెద్దగా చేసిందేమీ లేదని ఈ సందర్బంగా వీరూ అనడం గమనార్హం. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 37 బంతుల్లోనే 72 రన్స్ చేసి ఒకప్పటి సూర్యను తలపించిన అతడు.. మూడో వన్డేలో విఫలమయ్యాడు.
క్రిక్‌బజ్ తో మాట్లాడిన సెహ్వాగ్.. తుది జట్టు ఎలా ఉంటుందన్నదానిపై మాట్లాడాడు. "ఆరు, ఏడు స్థానాల్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఉంటారు. అంటే ఆ రెండు స్థానాల్లో సూర్యకుమార్ ఉండబోడు. ఐదో స్థానం కూడా ఉంది. కానీ హార్దిక్ పాండ్యా ఆరో బౌలర్ అయితే.. రాహుల్ ఐదు, హార్దిక్ ఆరోస్థానంలో ఆడతారు. ఆ తర్వాత బౌలర్లు ఉంటారు. ఇషాన్ ఏదో స్థానంలో ఉంటాడని అనుకున్నా.. శ్రేయస్ సెంచరీ తర్వాత ఆ ఆశలు పోయాయి. శ్రేయస్ 4, రాహుల్ 5, హార్దిక్ 6వ స్థానాల్లో వస్తారు" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయగలడా లేదా అన్నది కూడా టీమ్ చూడాలని వీరూ చెప్పాడు. ఒకవేళ అతడు 10 ఓవర్లు వేస్తే అదనపు బౌలర్ అవుతాడని, అలాంటప్పుడు లభించే మరో స్థానంలో సూర్యకుమార్ కంటే ఇషాన్ కిషన్ మేలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అతడు లెఫ్ట్ హ్యాండర్ కావడం అదనపు బలమని చెప్పాడు.
"వన్డే క్రికెట్ లో సూర్యకుమార్ పెద్దగా చేసిందేమీ లేదు. అతడు చివరి 15-20 ఓవర్లలో మాత్రమే ఆడతాడు. ఆ సమయంలో అతడు తన టీ20 సామర్థ్యాలను ఉపయోగిస్తాడు. కానీ అదే పని హార్దిక్, ఇషాన్, రాహుల్ కూడా చేయగలరు. అందువల్ల శ్రేయస్ 4వ స్థానం ఖాయం. ఒకవేళ సూర్యకు అవకాశం దక్కితే అతడు ఓ భారీ సెంచరీ చేసిన తనను తాను నిరూపించుకోవాలి" అని సెహ్వాగ్ అన్నాడు.