Sai Kishore: జాతీయ గీతం వినిపించగానే ఏడ్చేసిన టీమిండియా క్రికెటర్.. భావోద్వేగానికి గురైన సాయి కిశోర్..-sai kishore gets emotional while playing national anthem at asian games 2023 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sai Kishore: జాతీయ గీతం వినిపించగానే ఏడ్చేసిన టీమిండియా క్రికెటర్.. భావోద్వేగానికి గురైన సాయి కిశోర్..

Sai Kishore: జాతీయ గీతం వినిపించగానే ఏడ్చేసిన టీమిండియా క్రికెటర్.. భావోద్వేగానికి గురైన సాయి కిశోర్..

Hari Prasad S HT Telugu
Published Oct 03, 2023 12:00 PM IST

Sai Kishore: జాతీయ గీతం వినిపించగానే ఏడ్చేశాడు టీమిండియా క్రికెటర్ సాయి కిశోర్. ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తొలిసారి ఇండియా తరఫున ఆడే అవకాశం రావడంతో అతడు భావోద్వేగానికి గురయ్యాడు.

జాతీయ గీతం వినిపిస్తుండగా కంటతడి పెడుతున్న సాయి కిశోర్
జాతీయ గీతం వినిపిస్తుండగా కంటతడి పెడుతున్న సాయి కిశోర్

Sai Kishore: ప్రతి క్రికెటర్ ఇండియన్ టీమ్ కు ఆడాలని కలలు కంటాడు. ఆ కల నిజమైనప్పుడు ఎంతో భావోద్వేగానికి గురవుతాడు. తాజాగా యువ క్రికెటర్ సాయి కిశోర్ కూడా అలాగే ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ కు ముందు భారత జాతీయ గీతం వినిపించగానే అతడు ఏడ్చేశాడు. సాయి కిశోర్ అలా కన్నీళ్లు పెట్టడం చూసి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.

ఇండియా తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆనందంలో సాయి కిశోర్ భావోద్వేగానికి గురయ్యాడు. నేపాల్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు ముందు జాతీయ గీతం సందర్భంగా అతడు కంటతడి పెడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఓ ప్లేయర్ కు తన జాతీయ జట్టుకు ఆడే అవకాశం తొలిసారి దొరికితే ఎలా ఎమోషనల్ అవుతాడో సాయి కిశోర్ ను చూస్తే అర్థమవుతోంది.

ఈ వీడియోను బ్రాడ్‌కాస్టర్ సోనీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీనిపై వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా స్పందించాడు. సాయి కిశోర్ కు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. తన స్పిన్ తో అదరగొట్టాడు. ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో అతడు 4 ఓవర్లు వేసి కేవలం 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ సందర్భంగా సాయి కిశోర్ ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాన్ని గుర్తు చేస్తే కార్తీక్ ఓ పోస్ట్ చేశాడు.

"హార్డ్ వర్క్ చేసే వాళ్లకు ఆ దేవుడు తనదైన మార్గంలో ఫలితాన్ని తిరిగి ఇస్తాడు. సాయి కిశోర్ అనే ఈ నమ్మశక్యం కాని ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్ ను డామినేట్ చేశాడు. అతడో సూపర్ స్టార్. చాలా సంతోషంగా ఉంది. ఉదయం లేవగానే అతని పేరు తుది జట్టులో చూసి ఎమోషనల్ అయ్యాను. కొందరు బాగా రాణించాలని మనం అనుకుంటాం.

నా జాబితాలో ఎప్పుడూ అతడు టాప్ లో ఉంటాడు. అతడు బ్యాటింగ్ లో రాణిస్తున్న విధానం అద్భుతం. ఎంతో మెరుగయ్యాడు. అతని గురించి నేను ఎంతైనా చెబుతూనే ఉంటాను. మొత్తానికి ఇండియన్ క్రికెటర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది" అని కార్తీక్ ట్వీట్ చేశాడు.

నేపాల్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా 23 పరుగులతో గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. యశస్వి సెంచరీ, రింకు మెరుపులు.. బంతితో రవి బిష్ణోయ్ మ్యాజిక్ తోపాటు సాయి కిశోర్ కూడా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

Whats_app_banner