తాజాగా క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన క్యాచ్‌లలో ఒకదానికి షెఫీల్డ్ షీల్డ్ టోర్నీవేదికైైంది. ఈ ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలో వెస్టర్న్ ఆస్ట్రేలియా, విక్టోరియా మధ్య మ్యాచ్‌లో ఇది జరిగింది. ఈ క్యాచ్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దృష్టిని ఆకర్షించింది. తన సోషల్ మీడియాలో సచిన్ ఈ క్యాచ్ ను పోస్టు చేశాడు. మైండ్ పోతోందంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
వెస్టర్న్ ఆస్ట్రేలియాపై విక్టోరియా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ 22 ఏళ్ల క్యాంప్‌బెల్ కెల్లావే మూడో ఇన్నింగ్స్‌లో 165* పరుగులతో రాణించాడు. అయితే ఆ ప్రత్యేక ఇన్నింగ్స్ తో పాటు ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన క్యాచ్ కూడా అందుకున్నాడు. సూపర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకున్నాడు.
వెస్టర్న్ ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి, లక్ష్యానికి 80 పరుగులు దూరంలో ఉంది. అప్పుడు కెమెరాన్ గ్యానన్.. విక్టోరియా కెప్టెన్ విల్ సదర్లాండ్ బౌలింగ్‌లో హుక్ షాట్ ఆడాడు. ఆ బంతి లాంగ్ లెగ్ వైపు వెళ్ళింది. అక్కడ కెల్లావే ఫీల్డింగ్ చేస్తున్నాడు. ముందుగా బంతిని తప్పుగా అంచనా వేసి ముందుకు వెళ్ళిన కెల్లావే వెంటనే తిరిగి వచ్చి, వెనుకకు వంగి ఎగిరి చేయి చాచి క్యాచ్‌ను పట్టుకున్నాడు.
ఈ మ్యాచ్ లో కెల్లావే పట్టిన ఈ క్యాచ్ సంచలనంగా మారింది. ఇదో అద్భుతమంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సచిన్ కూడా ఈ క్యాచ్ ను పోస్టు చేశాడు.
“ఇదేమైనా స్పైడర్‌మ్యాన్ లేదా సూపర్‌మ్యాన్ కోసం ఆడిషన్ హా? ఇది నిజంగా మైండ్ బాగ్లింగ్ క్యాచ్. చాలా అద్భుతం” అని 51 ఏళ్ల సచిన్ ఈ క్యాచ్ వీడియోను ఎక్స్ లో పోస్టు చేశాడు.
‘‘నిజంగా చెప్తున్నా ఇంతకంటే బెటర్ క్యాచ్ చూడలేదు. కెమెరా కంటికి చిక్కిన దీన్ని చూస్తుంటే మరింత బాగుంది. ఎండలో సూర్యుని వెలుగును దాటి ఆ క్యాచ్ పట్టడం అద్భుతం. అతని 150 పరుగుల ఇన్నింగ్స్ కంటే ఇదే బెటర్’’ అని విక్టోరియా కెప్టెన్ సదర్లాండ్.. కెల్లావే ను ఆకాశానికి ఎత్తేశాడు.
సంబంధిత కథనం