Sachin on Vinesh Phogat: రావాల్సిన పతకాన్ని లాక్కోవడం అన్యాయమే.. సిల్వర్ మెడల్‌కు ఆమె అర్హురాలు: వినేశ్‌పై సచిన్ ట్వీట్-sachin tendulkar says vinesh phogat robbed of her medal she deserves a silver medal paris olympics 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sachin On Vinesh Phogat: రావాల్సిన పతకాన్ని లాక్కోవడం అన్యాయమే.. సిల్వర్ మెడల్‌కు ఆమె అర్హురాలు: వినేశ్‌పై సచిన్ ట్వీట్

Sachin on Vinesh Phogat: రావాల్సిన పతకాన్ని లాక్కోవడం అన్యాయమే.. సిల్వర్ మెడల్‌కు ఆమె అర్హురాలు: వినేశ్‌పై సచిన్ ట్వీట్

Hari Prasad S HT Telugu
Aug 09, 2024 09:43 PM IST

Sachin on Vinesh Phogat: వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆమె సిల్వర్ మెడల్ కు అన్ని విధాలా అర్హురాలని, ఆమె నుంచి మెడల్ లాక్కోవడం అన్యాయమని మాస్టర్ అభిప్రాయపడ్డాడు.

రావాల్సిన పతకాన్ని లాక్కోవడం అన్యాయమే..ఇక్కడా అంపైర్స్ కాల్ ఉండాలి: వినేశ్‌పై సచిన్ ట్వీట్
రావాల్సిన పతకాన్ని లాక్కోవడం అన్యాయమే..ఇక్కడా అంపైర్స్ కాల్ ఉండాలి: వినేశ్‌పై సచిన్ ట్వీట్ (AFP)

Sachin on Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో తనకు రజత పతకం అందించాలని భారత ఒలింపియన్ వినేశ్ ఫోగట్.. క్రీడా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరిన నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. మహిళల 50 కేజీల స్వర్ణ పతక పోరు నుంచి అనర్హత వేటు పడిన వినేశ్ ఫోగట్.. సిల్వర్ మెడల్ కు పూర్తిగా అర్హురాలని అతడు స్పష్టం చేశాడు.

తర్కానికి అందని నిర్ణయం: సచిన్

వినేశ్ అనర్హత పిటిషన్ పై మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ తన అభిప్రాయాలను తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. అతని ప్రకారం, ప్రతి క్రీడకు నియమాలు ఉంటాయి.. ఆ నియమాలను సందర్భోచితంగా చూడాల్సిన అవసరం ఉంది.. బహుశా కొన్నిసార్లు వాటిని పునఃసమీక్షించాల్సి ఉంటుంది.. పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ కు రజత పతకం దక్కాలని బ్యాటింగ్ దిగ్గజం అభిప్రాయపడ్డాడు.

"ప్రతి క్రీడకు నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను సందర్భోచితంగా చూడాల్సిన అవసరం ఉంది.. కొన్నిసార్లు పునఃసమీక్షించాలి. వినేశ్ ఫోగట్ ఫెయిర్ అండ్ స్క్వేర్ తో ఫైనల్స్ కు అర్హత సాధించింది. ఆమె బరువు కారణంగా అనర్హత వేటు పడటం ఫైనల్స్ కు ముందు జరిగింది. అందువల్ల ఆమెకు రజత పతకం దక్కకపోవడం తర్కానికి, స్పోర్టింగ్ సెన్స్ కు విరుద్ధం" అని సచిన్ పేర్కొన్నాడు.

అలా చేస్తే తప్పు.. కానీ..

ఓ అథ్లెట్ నిషేధిత ఉత్ప్రేరకాలను వాడితే తప్పు కానీ.. ఇలాంటి విషయాల్లో అనర్హత అనేది సరికాదని మాస్టర్ అభిప్రాయపడ్డాడు. "ఆటతీరును మెరుగుపరిచే డ్రగ్స్ వాడకం వంటి నైతిక ఉల్లంఘనల కారణంగా ఒక అథ్లెట్ పై అనర్హత వేటు పడితే అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు పతకం ఇవ్వకుండా చివరి స్థానంలో నిలవడం సమంజసమే అవుతుంది.

అయితే వినేశ్ తన ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి టాప్-2కు చేరింది. ఆమె కచ్చితంగా రజత పతకానికి అర్హురాలు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ నుంచి తీర్పు కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. వినేశ్ కు దక్కాల్సిన గుర్తింపు లభిస్తుందని ఆశిద్దాం, ప్రార్థిద్దాం' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.

సిల్వర్ వస్తుందా?

పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల విభాగంలో స్వర్ణ పతక పోరుకు ముందు వినేశ్ ఫోగాట్ పై విధించిన అనర్హత వేటుపై చేసిన అప్పీలును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) ఆమోదించింది. అంతేకాదు శుక్రవారం (ఆగస్ట్ 9) దీనిపై అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. దీంతో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఒలింపిక్ రజత పతకం ఆశలు సజీవంగా ఉన్నాయి.

"ఒలింపిక్ గేమ్స్ పారిస్ 2024లో మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతక పోరుకు ముందు తనపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) తీసుకున్న నిర్ణయానికి సంబంధించి భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (దరఖాస్తుదారు) 2024 ఆగస్టు 7న దరఖాస్తు దాఖలు చేశారు'' అని సీఏఎస్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.