మాజీ క్రికెటర్ల క్రికెట్ టోర్నీ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్) 2025 టైటిల్‍ను ఇండియన్ మాస్టర్స్ కైవసం చేసుకుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. రాయ్‍పూర్ వేదికగా ఆదివారం జరిగిన ఐఎంఎల్ 2025 ఫైనల్‍లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ మాస్టర్స్ జట్టుపై ఇండియా మాస్టర్స్ విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‍లో క్లాసీ షాట్లతో సచిన్ అలరించారు.
సచిన్ టెండూల్కర్ ఈ ఫైనల్‍లో 18 బంతుల్లో 25 పరుగులు చేశారు. 2 ఫోర్లు, ఓ సిక్స్ బాదారు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా క్లాసీ షాట్లతో సచిన్ దుమ్మురేపారు. అద్భుతమైన టైమింగ్‍తో రెండు అప్పర్ కట్ షాట్లు కొట్టారు. తన వింటేజ్ షాట్లను చూపించారు. 2003 ప్రపంచకప్‍లో పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్‌ను చితక్కొట్టిన షాట్లను ఈ మ్యాచ్‍లో తన స్టైలిష్ షాట్లతో గుర్తు చేశారు సచిన్ టెండూల్కర్. ఇంటర్నేషనల్ క్రికెట్‍కు దూరమై దశాబ్దం దాటినా తనలో ఏ మాత్రం బ్యాటింగ్ తగ్గలేదని చాటిచెప్పారు. సచిన్ స్టైలిష్ షాట్లతో అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐఎంఎల్ సొంతమవడంతో కెప్టెన్ సచిన్, లెజెండరీ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, ఇర్ఫాన్ పఠాన్ సహా ఇండియా మాస్టర్స్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. సంతోషంగా టైటిల్ అందుకొని సెలెబ్రేట్ చేసుకున్నారు సచిన్. జట్టు సభ్యులంతా టైటిల్‍ను పట్టుకొని.. యువ ఆటగాళ్లలా కేరింతలు కొట్టారు.
ఐఎంఎల్ ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. లెండిల్ సిమన్స్ (57) అర్ధ శతకం చేయగా.. డ్వైన్ స్మిత్ (45) రాణించాడు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ మూడు వికెట్లు, షాబాజ్ నదీమ్ రెండు పడగొట్టారు. పవన్ నేగీ, స్టువర్ట్ బున్నీ తలా ఓ వికెట్ దక్కింది.
17.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 149 పరుగులు చేసి ఇండియా మాస్టర్స్ గెలిచింది. ఓపెనర్‌గా వచ్చిన తెలుగు ప్లేయర్ అంబటి రాయుడు అర్ధ శకతంతో అదరగొట్టారు. 50 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో దుమ్మురేపాడు. సచిన్ కూడా ఉన్నంతసేపు దూకుడుగా ఆడారు. యువరాజ్ సింగ్ (13 నాటౌట్), స్టువర్ట్ బిన్నీ (16 నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టు గెలుపుతీరం దాటించారు.
గాయం అవుతుందేమోనని వెస్టిండీస్ మాస్టర్స్ బౌలర్ టినో బెస్ట్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లాలని అనుకున్నారు. దీంతో ఇది సరికాదంటూ అంపైర్‌కు భారత ప్లేయర్ యువరాజ్ ఫిర్యాదు చేశారు. దీంతో యువరాజ్ వైపుగా బెస్ట్ దూసుకొచ్చారు. దీంతో యువరాజ్, బెస్ట్ మధ్య వాదన జరిగింది. ఒకరిని ఒకరు మాటలు అనుకున్నారు. వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియన్ లారా వచ్చి ఇద్దరినీ శాంతింపజేశారు.
సంబంధిత కథనం